


ప్రభుత్వ పాఠశాలలే తెలంగాణ భవిష్యత్‌కు పునాది: సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు రేపటి తెలంగాణ పునర్నిర్మాణంలో అత్యంత కీలక పాత్ర పోషించాలి. పలుగు, పార పట్టిన చేతులే.. రేపు కలాలు పట్టి తెలంగాణ రాతను మార్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
బుధవారం వనపర్తి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. వనపర్తి జిల్లా కొత్తకోటలో బాలికల ఉన్నత పాఠశాల నూతన భవనానికి ప్రారంభోత్సవం చేసిన సీఎం, అనంతరం మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద అమర రాజా గిగా కారిడార్‌లో ఏర్పాటు చేసిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ తయారీ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ పర్యటనలో విద్యా, సాగునీరు, పారిశ్రామిక రంగాలపై సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
కొత్తకోట పాఠశాల ప్రాంగణంలో విద్యార్థినులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చదువొక్కటే జీవితాల్లో వెలుగులు నింపి, సమాజంలో ఆత్మగౌరవాన్ని పెంచుతుందన్నారు. తల్లిదండ్రుల కళ్లలో ఆనందాన్ని నింపే శక్తి విద్యకు మాత్రమే ఉందన్నారు. గతంలో సరైన మౌలిక వసతులు లేకపోవడం వల్లే ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందని, అందుకే కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా వీటిని బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని శపథం చేశారు.
ఆగస్టు 15 నాటికి రూ. 1,000 కోట్లతో ఎడ్యుకేషన్ కిట్లు
రాష్ట్రంలోని 27.50 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆగస్టు 15వ తేదీ లోపు 9 రకాల వస్తువులతో కూడిన ‘తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్లను’ అందించబోతున్నామని సీఎం ప్రకటించారు. ఈ కిట్లలోని వస్తువుల నాణ్యతపై విద్యార్థులే నేరుగా వాట్సాప్ ద్వారా విద్యాశాఖకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధ్యాయులకు 16 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లు, పదేళ్లుగా నిలిచిపోయిన బదిలీలను పూర్తి చేశామన్నారు. 317 జీవో ద్వారా చెదిరిపోయిన ఉపాధ్యాయ కుటుంబాలను ఒకచోట చేర్చామని తెలిపారు. ఉపాధ్యాయుల కృషితో కేంద్ర విద్యాశాఖ పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో తెలంగాణ 36వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరిందని, అయితే మొదటి రెండు స్థానాలు సాధించే వరకు విశ్రమించబోమని సీఎం స్పష్టం చేశారు. ప్రతిభ కనబరిచిన టీచర్లకు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు అవార్డులు ఇస్తామన్నారు. ఉత్తమ విద్యావిధానాల అధ్యయనం కోసం ఇప్పటికే 50 మంది టీచర్లను విదేశాలకు పంపించగా, వచ్చే ఏడాది మరో 150 మందిని పంపించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నందున, యువతలో నైపుణ్యాలు పెంచి బ్లూ కాలర్ ఉద్యోగాలు సాధించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులకు జర్మన్, జపనీస్ వంటి భాషలను నేర్పించాలని సూచించారు. ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ. 1.08 లక్షలు ఖర్చు చేస్తోందని గుర్తుచేశారు.
పాలమూరు ప్రాజెక్టులకు అనుమతులు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై త్వరలోనే శుభవార్త వినబోతున్నారని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు కింద 90 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఒప్పించి అనుమతులు సాధించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. డిండి ప్రాజెక్టుకు సంబంధించి 30 టీఎంసీల నీటి కేటాయింపులపై కూడా సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలిపారు.
కృష్ణా పరివాహక ప్రాంతంలో నిర్మాణ దశలో ఉన్న దిండి, పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఆర్డీఎస్ ప్రాజెక్టుల సమస్యలను పరిష్కరించుకోవడానికి పక్క రాష్ట్రంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు. తాను పాలమూరు జిల్లా వాడిగా ఈ వెనుకబడిన ప్రాంతాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. అందుకే ఈ జిల్లాలో ట్రిపుల్ ఐటీ, ఇంజనీరింగ్ కాలేజీలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఏటీసీలను తీసుకొచ్చామని వివరించారు.
దివిటిపల్లిలో అమర రాజా గిగా కారిడార్ ప్రారంభం
మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా గ్రూప్ స్థాపించిన కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ తయారీ యూనిట్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలుష్య రహిత సమాజం కోసం ఈవీ వాహనాలు, బ్యాటరీల వినియోగం పెరగాలని, ఈ క్రమంలో 32 గిగావాట్ సామర్థ్యం కలిగిన యూనిట్‌ను అమర రాజా ఇక్కడ స్థాపించడం సంతోషకరమన్నారు. ఈ సంస్థలో పనిచేసే 700 మంది ఉద్యోగులలో 400 మంది మహిళలే ఉండటం గర్వకారణమన్నారు. చైనా, జర్మనీ, జపాన్ వంటి గ్లోబల్ ఈవీ లీడర్లతో పోటీపడుతున్న అమర రాజా సంస్థకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు.
పరిశ్రమల స్థాపన కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను స్మరిస్తూ, స్థానిక నిరుద్యోగ యువతకే గరిష్ట ఉద్యోగావకాశాలు కల్పించాలని యాజమాన్యానికి సూచించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు తాము కొత్త టూరిజం, ఎనర్జీ, మెడికల్, స్పోర్ట్స్ పాలసీలను తెచ్చామని, ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యాల సాధనలో అమర రాజా సంస్థ తోడ్పాటు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమాలలో రాష్ట్ర మంత్రులు డి. శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి, అమర రాజా గ్రూప్ చైర్మన్ గల్లా జయదేవ్, ఎంపీ డి.కె. అరుణ, ప్రభుత్వ విప్ జనంపల్లి అనిరుధ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
