
ప్రభుత్వ ఉద్యోగులకు రూ.కోటి బీమా.. దేశంలోనే తొలిసారి: డిప్యూటీ సీఎం భట్టి
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, పెన్షనర్లకు అందిస్తున్న రూ.కోటి బీమా పథకం దేశంలోనే తొలిసారిగా అమలు చేస్తున్నదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగి దురదృష్టవశాత్తూ మృతిచెందిన సందర్భంలో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా చూడటమే ఈ పథకం ఉద్దేశమన్నారు.
ప్రభుత్వంపై, ఉద్యోగులపై ఎలాంటి అదనపు ఆర్థిక భారం లేకుండా బ్యాంకుల సహకారంతో ఈ బీమా పథకాన్ని అమలు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క వివరించారు. ఉద్యోగుల వేతనాలు జమయ్యే బ్యాంకులతో ప్రభుత్వం చర్చించి, తమ ఖాతాదారులైన ఉద్యోగులకు బీమా కల్పించేందుకు సహకరించాలని కోరినట్లు తెలిపారు. అవసరమైతే ఉద్యోగుల తరఫున బీమా ప్రీమియాన్ని బ్యాంకులే చెల్లించేలా ఒప్పించినట్లు చెప్పారు.
ఈ పథకాన్ని తొలుత సింగరేణి కాలరీస్ ఉద్యోగులకు అమలు చేశామని, అనంతరం విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు) ఉద్యోగులు, ఇతర సిబ్బందికి విస్తరించామని తెలిపారు. సింగరేణి ఉద్యోగులకు 2024 ఫిబ్రవరి నుంచి, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగులకు 2026 జూన్ నుంచి పథకం అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది ఈ బీమా పరిధిలో ఉన్నారని భట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో 2,72,600 మంది పెన్షనర్లు, 5,18,273 మంది రెగ్యులర్ ఉద్యోగులు, 5,00,158 మంది తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్, బహుళ ప్రయోజన, కాంట్రాక్ట్, రోజువారీ వేతన సిబ్బంది తదితరులు ఉన్నారని వివరించారు.
