Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
ప్రతిపక్ష నేతను కలవొద్దని విదేశీ అతిథులకు ప్రభుత్వమే చెబుతోంది: రాహుల్ గాంధీ

ప్రతిపక్ష నేతను కలవొద్దని విదేశీ అతిథులకు ప్రభుత్వమే చెబుతోంది: రాహుల్ గాంధీ

Pinjari Chand
4 డిసెంబర్, 2025

భారత్‌లో రెండు రోజుల పర్యటనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విదేశీ అతిథులను లోక్‌సభలో ప్రతిపక్ష నేత (లీడర్ ఆఫ్ ఆపోజిషన్ - ఎల్‌ఓపి)ను కలవొద్దని ప్రభుత్వమే సూచిస్తోందని, ఇది దాని ‘అభద్రతా భావం’ను చూపిస్తోందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్ పరిసరాల్లో మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ మాట్లాడుతూ సాధారణంగా పర్యటనకు వచ్చే అతిథులు లోక్‌సభ ప్రతిపక్ష నేతతో భేటీ అవుతారు. అటల్ బిహారీ వాజపేయి హయాంలోనూ, మన్మోహన్ సింగ్ హయాంలోనూ ఇదే సంప్రదాయం ఉండేది. కానీ ఇప్పుడు విదేశీ అతిథులు వచ్చినప్పుడు లేదా నేను విదేశాలకు వెళ్లినప్పుడు ప్రభుత్వమే వారికి ‘ప్రతిపక్ష నేతను కలవొద్ద’ని సూచిస్తోందని అన్నారు. ప్రతిసారీ ఇదే జరుగుతోంది. విదేశీ నేతలు వచ్చినా, నేను విదేశాలకు వెళ్లినా ఒకే సందేశం వస్తోంది ప్రభుత్వమే వారికి ‘రాహుల్‌ను కలవొద్ద’ని చెప్పిందని తెలుస్తోంది అని వివరించారు.

ప్రతిపక్షం మరో దృక్కోణాన్ని చూపిస్తోంది

ఇలాంటి భేటీల ప్రాముఖ్యతను ఆయన వివరిస్తూ మేమూ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తాం. కేవలం ప్రభుత్వమే దేశానికి ప్రాతినిధ్యం వహించదు. ప్రతిపక్షం మరో దృక్కోణాన్ని చూపిస్తుంది. కానీ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలు విదేశీ నేతలను కలవడాన్ని ఇష్టపడటం లేదు. ఇది ఒక సంప్రదాయం, నియమం, కానీ మోడీజీ, విదేశాంగ మంత్రిత్వ శాఖ దీన్ని పాటించడం లేదని రాహుల్ అన్నారు. ఇలా చేయడానికి కారణం ఏమిటని అడిగిన ప్రశ్నకు వారి అభద్రతా భావమే (ఇన్‌సెక్యూరిటీ) అని సమాధానమిచ్చారు.

ప్రతిపక్ష నేతను కలవడం ప్రోటోకాల్ లో భాగమే

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియంక గాంధీ వాద్రా కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. విదేశీ అతిథులు ప్రతిపక్ష నేతను కలవడం ప్రోటోకాల్‌లో భాగమే. ఈ ప్రభుత్వం అన్నీ తన గుప్పెట్లో పెట్టుకోవాలని, ఇతర గొంతులు వినిపించకూడదని, ప్రోటోకాల్‌లను ఉల్లంఘిస్తోంది. ప్రజాస్వామ్యంలో ప్రోటోకాల్‌లు ఉంటాయి, వాటిని పాటించాలని అన్నారు. అతిథులు వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతను కలవడం ప్రోటోకాల్. దాన్ని ఎందుకు ఉల్లంఘిస్తారు? ఇది కేవలం అభద్రతా భావమే తప్ప మరొకటి కాదని విమర్శించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం సాయంత్రం ఢిల్లీ చేరుకుంటారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన ద్వైపాక్షిక సదస్సు నిర్వహించనున్నారు. రక్షణ రంగ సహకారం, భారత్-రష్యా వాణిజ్యంపై బయటి ఒత్తిళ్ల నుంచి రక్షణ, చిన్న మాడ్యులర్ రియాక్టర్లలో సహకారం వంటి అంశాలు ఈ సదస్సులో కీలకంగా ఉంటాయని తెలుస్తోంది. పాశ్చాత్య దేశాలు ఈ భేటీని ఆసక్తిగా గమనిస్తున్నాయి.

ప్రతిపక్ష నేతను కలవొద్దని విదేశీ అతిథులకు ప్రభుత్వమే చెబుతోంది: రాహుల్ గాంధీ - Tholi Paluku