Let's talk: editor@tmv.in
ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలే మేలు: సుదర్శన్ రెడ్డి

ప్రతికూల పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలే మేలు: సుదర్శన్ రెడ్డి

Gaddamidi Naveen
21 జులై, 2026

సూపర్ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి సూచించారు. గ్రామస్థాయిలో రైతులకు విస్తృత అవగాహన కల్పించి, తక్కువ నీటితో అధిక ఆదాయం ఇచ్చే పంటల సాగును ప్రోత్సహించాలని అధికారులకు ఆదేశించారు.

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికపై సోమవారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థాయి సమీక్ష సమావేశం సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పైడి రాకేశ్ రెడ్డి, తోట లక్ష్మీకాంత్ రావు, నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లు, తదితరులు హాజరయ్యారు.

సమావేశంలో శ్రీరాంసాగర్, నిజాంసాగర్, కౌలాస్ నాల, పోచారం, అలీసాగర్ తదితర ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి సరఫరా, విద్యుత్ డిమాండ్-సరఫరా, ప్రత్యామ్నాయ పంటల సాగు అంశాలపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా చర్చించారు. తక్కువ నీటితో సాగు చేయదగిన పంటలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు తమ సూచనలు వెల్లడించారు.

ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం అన్ని ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తోందన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను పరిరక్షిస్తూ తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, రైతులను ఆరుతడి పంటల సాగు వైపు మళ్లించాలని సూచించారు. ఆయిల్‌పామ్, కందులు, నువ్వులు, వేరుశనగ, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఉద్యాన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని చెప్పారు. తీగజాతి కూరగాయలు, పాడి పరిశ్రమకు రాయితీలు కల్పించేందుకు కృషి చేస్తామని, కోతులు, అడవి పందుల బెడద నివారణకు సోలార్ ఫెన్సింగ్‌కు సబ్సిడీ అందించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

ఉమ్మడి జిల్లాలోని జలాశయాల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేవని, భూగర్భ జలాలు కూడా తగ్గుతున్నాయని సుదర్శన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులపై ప్రతి రైతుకు స్పష్టమైన అవగాహన కల్పించి, నీటి వినియోగంలో మితవ్యయం పాటించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇప్పటికే 45 శాతం వర్షపాతం లోటు నమోదైనందున రైతులు పంటల వైవిధ్యాన్ని అవలంబించాలని సూచించారు. వరికి బదులుగా ఆయిల్‌పామ్, కూరగాయలు, ఆరుతడి పంటలు సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోలేకపోయినా, ముందస్తు ప్రణాళికలతో నష్టాన్ని తగ్గించవచ్చన్నారు. మిగిలిన సాగు విస్తీర్ణంలో ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని, భూగర్భ జలాల పెంపునకు సోక్‌పిట్స్, వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు.

నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి, కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌లు జిల్లాల్లో ఇప్పటికే రైతు వేదికల ద్వారా పంటల మార్పిడి, ఉద్యానవన పంటలు, ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తాగునీటి కొరత తలెత్తకుండా అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ ముందస్తు చర్యలు చేపడుతున్నామని వివరించారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, శాస్త్రవేత్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
ElNinoClimateChangeAlternativeCropsWaterConservationFarmersAgricultureTelanganaNizamabadKamareddyDrylandFarmingOilPalm