

ప్రతి శాఖకు ఫైనాన్షియల్ ప్లాన్: సీఎం చంద్రబాబు
రాష్ట్ర అభివృద్ధిలో భవిష్యత్తు ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులు, వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఆధారిత మౌలిక సదుపాయాల నిర్మాణానిదేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, భారీ పెట్టుబడుల ఆకర్షణ, ప్రభుత్వ ఆదాయ వృద్ధి లక్ష్యంగా రాష్ట్రంలో అమలు చేస్తున్న పీపీపీ ప్రాజెక్టులపై గురువారం ఆయన ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు.
సమీక్ష సందర్భంగా గతంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు అభివృద్ధికి ఊతమిచ్చాయని, ఇప్పుడు మౌలిక సదుపాయాల విప్లవం దేశాన్ని ముందుకు తీసుకెళ్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టే ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో రూ.1.23 లక్షల కోట్ల విలువైన 260 పీపీపీ ప్రాజెక్టులు
ప్రస్తుతం రాష్ట్రంలో పోర్టులు, షిప్‌యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక రంగం, పరిశ్రమలు, పురపాలక శాఖ, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ వంటి అనేక రంగాల్లో మొత్తం 260 పీపీపీ ప్రాజెక్టులు అమలులో ఉన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీటి మొత్తం విలువ రూ.1,23,229 కోట్లు అని తెలిపారు.
ఈ ప్రాజెక్టులన్నింటినీ దీర్ఘకాలికంగా ఆదాయం తీసుకొచ్చే సస్టెయినబుల్ మోడల్లో అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి ప్రాజెక్టు కేవలం నిర్మాణంతో ముగియకుండా, దాని చుట్టూ ఆర్థిక కార్యకలాపాలు పెరిగే విధంగా రూపకల్పన చేయాలని సూచించారు.
కేంద్ర నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి
వివిధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అర్బన్ ఛాలెంజ్ ఫండ్ వంటి పథకాలను సమర్థంగా వినియోగించుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. పోర్టులు, విమానాశ్రయాలు, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్వహణ కోసం సమర్థవంతమైన వ్యవస్థను రూపొందించాలని ఆదేశించారు.
కోస్టల్ టూరిజంలో మత్స్యకారులకు భాగస్వామ్యం
రాష్ట్ర తీరప్రాంత పర్యాటక అభివృద్ధిలో స్థానిక మత్స్యకారులను భాగస్వాములను చేసి వారికి ప్రత్యక్షంగా ఉపాధి, ఆదాయం కలిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అభివృద్ధి ఫలాలు స్థానిక ప్రజలకు చేరే విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
అలాగే రాష్ట్రంలోని 21 ప్రధాన దేవాలయాల పరిసర ప్రాంతాల్లో భక్తులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో పాటు, అక్కడ ఆర్థిక కార్యకలాపాలు పెరిగేలా పబ్లిక్ టచ్ పాయింట్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.
వేస్ట్ టు ఎనర్జీ, మెడికల్ కాలేజీలకు భారీ వీజీఎఫ్
విజయవాడ, తిరుపతిలో ఏర్పాటు చేస్తున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు రూ.178 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కేంద్రం నుంచి లభిస్తోందని అధికారులు వివరించారు.
అదేవిధంగా రాష్ట్రంలో నిర్మిస్తున్న మెడికల్ కాలేజీలకు రూ.1,468 కోట్ల వీజీఎఫ్ అందనున్నట్లు తెలిపారు. ఈ కాలేజీల నిర్మాణాన్ని పీపీపీ విధానంలో చేపట్టిన తీరును కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం ప్రత్యేకంగా ప్రశంసించిందని అధికారుల నివేదికలో పేర్కొన్నారు.
త్వరలో పీపీపీ- వీజీఎఫ్ పాలసీ 1.0
రాష్ట్రానికి ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఆంధ్రప్రదేశ్ పీపీపీ- వీజీఎఫ్ పాలసీ 1.0ను వచ్చే కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టాలని చంద్రబాబు ఆదేశించారు. పాలసీకి సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయాలని అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విజయవంతమైన విధానాలను అధ్యయనం చేసి రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కొత్త విధానాన్ని రూపొందించాలని పేర్కొన్నారు.
2047 స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా ప్రతి ఏడాది పీపీపీ ప్రాజెక్టుల ద్వారా సుమారు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ఎకనామిక్ రీజియన్లలో భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టే అవకాశముందని వివరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా మైక్రో, మ్యాక్రో స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేసి, ఎప్పటికప్పుడు లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలని సూచించారు.
ప్రతి ప్రభుత్వ శాఖకు ఫైనాన్షియల్ ప్లాన్ తప్పనిసరి
ప్రతి ప్రభుత్వ శాఖకు ప్రత్యేకంగా ఫైనాన్షియల్ ప్లాన్ ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలతో ఆదాయ వనరులను పెంచే మార్గాలను గుర్తించాలని ఆదేశించారు.
భవిష్యత్తులో పరిశ్రమలకు సరఫరా చేసే నీటి ద్వారా జలవనరుల శాఖకు కూడా గణనీయమైన ఆదాయం లభించే అవకాశం ఉందని పేర్కొన్నారు. సాగునీటి సంఘాలు కూడా ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని తెలిపారు.
పీపీపీ ప్రాజెక్టుల అమలులో ప్రభుత్వ శాఖలు పెట్టుబడిదారుల్లో విశ్వాసం కలిగించే విధంగా పనిచేయాలని సీఎం సూచించారు. ఏ రంగమైనా ఆంధ్రప్రదేశ్‌కు "ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్" దక్కేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.
అంతే కాకుండా, ప్రభుత్వానికి చెందిన నిరుపయోగంగా ఉన్న ఆస్తులను ఆదాయం వచ్చే అవకాశాలుగా మార్చాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలోని అన్ని బస్టాండ్ల వద్ద ప్రభుత్వ భూములను వాణిజ్యపరంగా అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.
అలాగే పంప్డ్ స్టోరేజ్, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, గనులు, నెడ్‌క్యాప్, పర్యాటకం, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో పీపీపీ విధానంలో భారీ పెట్టుబడులు ఆకర్షించి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని సూచించారు.
రెసిడెన్షియల్ పాఠశాలలను మినీ టౌన్‌షిప్‌లుగా అభివృద్ధి చేయాలి
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రెసిడెన్షియల్ హాస్టళ్లలో చదివే విద్యార్థుల సంఖ్యను రెట్టింపు చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని సీఎం వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రధాన రహదారులకు సమీపంగా ఆధునిక సౌకర్యాలతో కూడిన మినీ టౌన్షిప్ తరహా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను నైపుణ్యం కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్ది, భవిష్యత్తులో ఐఐటీలు, ఐఐఎంలు వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివే స్థాయికి తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌తో పాటు ఆర్థిక శాఖ, పరిశ్రమలు, పురపాలక, మౌలిక సదుపాయాల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
