Let's talk: editor@tmv.in
ప్రతి ఎకరానికీ సాగునీరే లక్ష్యం.. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
ప్రతి ఎకరానికీ సాగునీరే లక్ష్యం.. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
ప్రతి ఎకరానికీ సాగునీరే లక్ష్యం.. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు

ప్రతి ఎకరానికీ సాగునీరే లక్ష్యం.. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు

Gaddamidi Naveen
16 జులై, 2026

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి ఎకరానికీ సాగునీరు అందించడమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధన కోసం గత రెండేళ్లలో సాగునీటి రంగానికి రూ. 24,000 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రముఖ ఇంజనీర్ కె.ఎల్. రావు 124వ జయంతిని పురస్కరించుకుని బుధవారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద జరిగిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. 2014-2019 మధ్యకాలంలో గత టీడీపీ ప్రభుత్వం సాగునీటి రంగానికి రూ. 68,000 కోట్లు ఖర్చు చేయగా, 2024 నుంచి ఈ రెండేళ్ల వ్యవధిలోనే రూ. 24,000 కోట్లు వెచ్చించామని వివరించారు.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా-గోదావరి పవిత్ర సంగమ స్థలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 'జలహారతి' కార్యక్రమంలో పాల్గొన్నారు. నదీమతల్లులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్పమాలలు, వస్త్రాలు, పసుపు-కుంకుమలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కృష్ణా పశ్చిమ డెల్టా తాగునీటి అవసరాల కోసం మంత్రులు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రతి ఎకరానికీ సాగునీరు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. తుఫానుల వల్ల పంట నష్టపోకుండా, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు కృష్ణా నది నుంచి వరద ప్రవాహం తగ్గినప్పుడు రైతులకు రక్షణగా ఉండేందుకే పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని గుర్తుచేశారు. కృష్ణా డెల్టాను పునరుజ్జీవింపజేయడానికి గోదావరి నది నుంచి 80 టీఎంసీల నీటిని తరలించినట్లు తెలిపారు. ప్రారంభంలో పట్టిసీమ ప్రాజెక్టును కొందరు ఎగతాళి చేసినప్పటికీ, ప్రస్తుతం అదే ప్రాజెక్టు నీరు కృష్ణా డెల్టాను కాపాడుతోందన్నారు. 2015 నుంచి 2025 మధ్య కాలంలో 450 టీఎంసీల నీటిని తరలించామని, ఇందుకోసం పట్టిసీమ ప్రాజెక్టుపై కేవలం రూ. 1,300 కోట్లు మాత్రమే ఖర్చు చేశామని వివరించారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని తరలించడం వల్ల కృష్ణా జలాలను శ్రీశైలంలో నిల్వ చేసుకునే వీలు కలిగిందని, తద్వారా రాయలసీమ ప్రాంతానికి సాగునీరు అందించే అవకాశం లభించిందని పేర్కొన్నారు. సూపర్ ఎల్ నినో నేపథ్యంలో ప్రతి నీటి బొట్టునూ పొదుపుగా వాడుకోవాలని సూచించారు. 70 ఏళ్లలో మొదటిసారి ఈ ఏడాది గోదావరి ఇన్ ఫ్లో ఆలస్యమైందన్నారు. చెరువులు నింపాకే సాగునీరు అందిస్తామని, రైతులు ఆరుతడి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

గత ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు

జలవనరులు ఎండిపోతున్న తరుణంలో భూగర్భ జలాల మట్టాలను కాపాడేందుకు ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోందని చంద్రబాబు తెలిపారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం జలవనరులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని ఆయన ఆరోపించారు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయినా, గుండ్లకమ్మ, పులిచింతల ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయినా గత పాలకులు కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. గత ప్రభుత్వం పోలవరం డయాఫ్రామ్ వాల్ దెబ్బతినేలా చేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము గతంలో 72 శాతం పనులు పూర్తి చేయగా, గత ఐదేళ్లలో 2 శాతం కూడా పనులు జరగలేదన్నారు. తాను 37 సార్లు స్వయంగా పోలవరాన్ని సందర్శించి, 136 సార్లు సమీక్షలు జరిపి ప్రస్తుతం ప్రాజెక్టును 89 శాతానికి చేర్చామని వెల్లడించారు. నిర్వాసితులకు రూ. 2,250 కోట్లు చెల్లించామని, 2027 మార్చి నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.

రాష్ట్రంలోని వంశధార నుంచి పెన్నా వరకు గల అన్ని నదులను అంతర్గతంగా అనుసంధానం చేయడమే తన దార్శనికత అని చంద్రబాబు తెలిపారు. రాబోయే మూడేళ్లలో ప్రాధాన్యత క్రమంలో 36 ప్రాజెక్టులను పూర్తి చేస్తామని ప్రకటించారు.

ట్యాగ్‌లు
ChandrababuNaiduAndhraPradeshJalaharathiPattiseemaProjectPolavaramProjectIrrigationWaterManagementKrishnaDeltaGodavariRayalaseemaAPDevelopment