

ప్రజాకవికి అపూర్వ గౌరవం.. అందెశ్రీ కుటుంబానికి ఇచ్చిన వాగ్దానాలన్నీ నెరవేర్చాం: డిప్యూటీ సీఎం భట్టి
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాంస్కృతిక సారథి, ప్రజాకవి డాక్టర్ అందెశ్రీకి తమ ప్రభుత్వం అపూర్వ గౌరవం అందించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్‌లో అందెశ్రీ అంతిమ సంస్కారాలు జరిగిన ప్రదేశంలో ఏర్పాటు చేయనున్న ‘అందెశ్రీ స్మృతి వనం’కు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో కలిసి శనివారం భూమిపూజ చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ, సాధారణంగా ప్రభుత్వాలు లేదా నాయకులు ఒక కార్యక్రమం నిర్వహించి తర్వాత మరిచిపోతారని, అయితే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని అన్నారు. అందెశ్రీ మరణించిన సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన పాడె మోసి నివాళులర్పించడం ద్వారా ఒక కవికి ఇవ్వాల్సిన అత్యున్నత గౌరవాన్ని చాటారని గుర్తుచేశారు.
నిరుపేద దళిత కుటుంబం నుంచి ఎదిగి తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రజాకవికి సముచిత మర్యాదలు అందించడం ప్రభుత్వ బాధ్యతగా భావించామని భట్టి పేర్కొన్నారు. అందెశ్రీ అంత్యక్రియల సమయంలో కుటుంబానికి ఇచ్చిన ఐదు ప్రధాన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చామని తెలిపారు.
కుటుంబానికి అండగా నిలుస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఆయన కుమారుడు దత్తుకు బీజేఆర్ డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా ప్రభుత్వ ఉద్యోగం కల్పించామని చెప్పారు. అలాగే అందెశ్రీ రచించిన ప్రసిద్ధ కవితా సంకలనం ‘నిప్పుల వాగు’ 20 వేల ప్రతులను ప్రభుత్వ ఆధ్వర్యంలో ముద్రించి పంపిణీ చేయాలని విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. అంతిమ సంస్కారాలు జరిగిన ప్రదేశాన్ని స్మృతి వనంగా అభివృద్ధి చేస్తామని చెప్పిన హామీ మేరకు నేడు భూమిపూజ నిర్వహించామని తెలిపారు.
అదేవిధంగా అందెశ్రీకి పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో నింపిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని అధికారిక రాష్ట్ర గీతంగా ప్రకటించి ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో వినిపించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
“మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు” వంటి పాటల ద్వారా మానవత్వం, సామాజిక బాధ్యతలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు అందెశ్రీ అని కొనియాడిన భట్టి విక్రమార్క, ఆయన సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు.
