Let's talk: editor@tmv.in
ప్రజా సమస్యలపై చర్చ ఇష్టంలేకే బీఆర్‌ఎస్‌ను బయటకు పంపారు: ఎమ్మెల్యే సంజయ్‌

ప్రజా సమస్యలపై చర్చ ఇష్టంలేకే బీఆర్‌ఎస్‌ను బయటకు పంపారు: ఎమ్మెల్యే సంజయ్‌

Gaddamidi Naveen
11 సెప్టెంబర్, 2026

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అడ్డుకుంటోందని బీఆర్‌ఎస్‌ కోరుట్ల ఎమ్మెల్యే కె.సంజయ్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రతిపక్షం లేవనెత్తుతున్న అంశాలపై చర్చించేందుకు ఆసక్తి చూపడం లేదని విమర్శించారు. అసెంబ్లీ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను బయటకు పంపించారని ఆయన మండిపడ్డారు.

సస్పెన్షన్‌కు గురైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గురువారం పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నివాసంలో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ‘డర్టీ డిస్ట్రాక్షన్‌ పాలిటిక్స్‌’ చేస్తున్నారని విమర్శించారు. తొలిరోజు మమ్మల్ని అసెంబ్లీలోకి రాకుండా అడ్డుకున్నారు. రెండో రోజు మాజీ సీఎం, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌పై దాడికి కుట్ర పన్నారు. ఇక మూడో రోజు మేము సభలోకి వెళ్లగానే, సమావేశాలు ప్రారంభమైన మొదటి గంటలోనే మమ్మల్ని బయటకు పంపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో నిరసనలు, అంతరాయాలు ఏర్పడినప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చలకు స్పీకర్‌ అవకాశం కల్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో అనుసరించే విధానాలను పరిశీలిస్తే.. తెలంగాణ అసెంబ్లీలో మాత్రం సంప్రదాయాలు పాటించడం లేదని సంజయ్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను వరుసగా సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ అగ్రనేతలపై తీవ్ర విమర్శలు

కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాల‌పై విరుచుకుపడుతూ.. రాహుల్ గాంధీ రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరగడం వట్టి వేషధారణే. ఇప్పటికైనా రాజ్యాంగాన్ని పట్టుకుని తిరుగుతూ దాన్ని అవమానించడం ఆపాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలు, కేసీఆర్‌కు ఎదురవుతున్న బెదిరింపులపై కేటీఆర్ వెంటనే చర్చ చేపట్టాలని కోరడంతో సభలో గందరగోళం నెలకొంది. దీనిపై స్పీకర్ 22 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.