Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
'ప్రజా పాలన' పేరుతో ప్రభుత్వం మరో డ్రామా ఆడుతోంది: మాజీ మంత్రి హ‌రీష్‌‌రావు

'ప్రజా పాలన' పేరుతో ప్రభుత్వం మరో డ్రామా ఆడుతోంది: మాజీ మంత్రి హ‌రీష్‌‌రావు

Gaddamidi Naveen
6 మార్చి, 2026

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై మాజీ మంత్రి హ‌రీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ కార్యక్రమం అసలు అభివృద్ధి కోసం కాదని, కేవలం ప్రచార పర్వం మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని తన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో దాదాపు 800 రోజుల పాలన పూర్తయ్యే సరికి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చెప్పలేకపోతున్నదని ఆయన అన్నారు. అందుకే ఇప్పుడు 99 రోజుల ప్రణాళిక పేరిట మరో కొత్త డ్రామాకు ప్రభుత్వం తెరతీసిందని విమర్శించారు. రెండున్నరేళ్ల పాలన తర్వాతే ప్రగతి ప్రణాళికలు గుర్తుకు రావడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలు అమలులో విఫలమయ్యాయని హరీష్ రావు ఆరోపించారు. గతంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభల్లో ప్రజలు ఇచ్చిన లక్షలాది దరఖాస్తులు ఇప్పటికీ పరిష్కారం కాకుండా పడి ఉన్నాయని తెలిపారు. వాటికి పరిష్కారం చూపకుండా మళ్లీ పది వారాల పాటు కొత్త కార్యక్రమాలు నిర్వహించడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు.

రైతులకు హామీ ఇచ్చిన రైతు భరోసా ఇప్పటికీ అందలేదని, గత సీజన్‌కు సంబంధించిన పంట బోనస్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. అంతేకాకుండా యూరియా సరఫరా చేయడంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. యువతకు రెండేళ్లలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని, జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించలేదని అన్నారు. రాజీవ్ యువ వికాసం వంటి కార్యక్రమాలకు వచ్చిన దరఖాస్తులు కూడా పరిష్కారం కాలేదని తెలిపారు.

ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లో కూడా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పని చేయలేదని హరీష్ రావు విమర్శించారు. ప్రజా పాలన పేరుతో ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం జరుగుతోందని, దీనిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

'ప్రజా పాలన' పేరుతో ప్రభుత్వం మరో డ్రామా ఆడుతోంది: మాజీ మంత్రి హ‌రీష్‌‌రావు - Tholi Paluku