Let's talk: editor@tmv.in
ప్రజల కోసం ఎంతకైనా సిద్ధం.. కాళేశ్వరం నీటిని వాడాలి: ఎంపీ ఈటల రాజేందర్

ప్రజల కోసం ఎంతకైనా సిద్ధం.. కాళేశ్వరం నీటిని వాడాలి: ఎంపీ ఈటల రాజేందర్

Gaddamidi Naveen
11 జులై, 2026

కాళేశ్వరం ప్రాజెక్టు నీటి తరలింపు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సికింద్రాబాద్‌లోని గాయత్రి గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. "నా కణత మీద ఏకే-47 పెట్టి కాల్చి చంపుతా అన్నా ప్రజల విషయంలో రాజీపడను.. ధర్మం కోసం ఎంతకైనా సిద్ధం" అని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.

మేడిగడ్డలో నీటిని నిల్వ చేయాలని తాము కోరడం లేదని, ప్రస్తుతం నదిలో దిగువకు వెళ్లిపోతున్న నీటిని ఎత్తిపోసి రైతులకు, తాగునీటి అవసరాలకు వినియోగించాలని మాత్రమే సీఎం రేవంత్ రెడ్డికి సూచిస్తున్నామని అన్నారు. దేవాదుల వంటి ప్రాజెక్టులకు బ్యారేజ్ లేకుండానే నీటిని పంపింగ్ చేస్తున్నారని గుర్తు చేస్తూ, ఇదే విధానాన్ని కాళేశ్వరం విషయంలో కూడా అమలు చేయవచ్చని పేర్కొన్నారు. వ్యవసాయంపైనే 60 శాతం గ్రామీణ ప్రజల ఆదాయం ఆధారపడి ఉందని, సమయానికి నీళ్లివ్వకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరానికి ఇప్పుడే 107 ఎండీజీ నీటి సరఫరా తక్కువగా ఉందని, భవిష్యత్తులో నీటి కొరత వస్తే ప్రజలు ఎటు పోవాలని ప్రశ్నించారు. ఇంజనీర్లతో మాట్లాడి పనులు చేయించాలే తప్ప, రాజకీయ విమర్శలు కట్టిపెట్టాలన్నారు.

రాజకీయాల కోసం రైతులను ఇబ్బంది పెడితే ఖబర్దార్ అని హెచ్చరించారు. ప్రజలకు కోపం వస్తే కేసీఆర్ లాంటి వాడే ఖతమయ్యారని, సందర్భం వస్తే పాతాళంలో పాతర వేస్తారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన డబ్బులు ప్రజలవని, వాటిని వృథా చేయవద్దని ఈటల కోరారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని బయటపెట్టి, బాధ్యులను అరెస్ట్ చేసి, డబ్బులను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. తాము నీళ్లు ఎత్తిపోయమంటే ప్రభుత్వం రాజకీయం మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. బీజేపీ ఫిలాసఫీ ప్రకారం తనకు ‘తెలంగాణ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. పర్సన్ లాస్ట్’ అని, తాను ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివే వ్యక్తిని కాదని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. తాను తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ మట్టిబిడ్డగా ప్రజల పక్షాన మాట్లాడుతున్నానని ఈటల తెలిపారు. ఏ రాజకీయ పార్టీని విమర్శించడం తన ఉద్దేశం కాదని, ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నానని చెప్పారు.

ట్యాగ్‌లు
EtelaRajenderKaleshwaramProjectMedigaddaGodavariWatersTelanganaPoliticsTelanganaNewsFarmersFirstWaterForFarmersRevanthReddyUttamKumarReddy