Let's talk: editor@tmv.in
పోలీసు అమరుల కుటుంబాల కోసం ‘టీజీ-వీర్’ పోర్టల్ ప్రారంభించిన డీజీపీ

పోలీసు అమరుల కుటుంబాల కోసం ‘టీజీ-వీర్’ పోర్టల్ ప్రారంభించిన డీజీపీ

Gaddamidi Naveen
10 ఆగస్టు, 2026

పోలీసు అమరుల కుటుంబాల సమస్యలు, సంక్షేమ ప్రయోజనాలకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించేందుకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ ‘టీజీ-వీర్’ ప్రత్యేక పోర్టల్‌ను ఆదివారం ప్రారంభించారు. వరంగల్ జిల్లాలో పర్యటించిన ఆయన.. వరంగల్ కమిషనరేట్ పరిధిలో నక్సలిజంపై పోరులో ప్రాణాలు కోల్పోయిన 28 మంది పోలీసు అమరుల కుటుంబ సభ్యులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు.

అమరుల కుటుంబాలకు ఆర్థిక సాయం, కారుణ్య నియామకాలు, ఇంటి స్థలాల కేటాయింపు, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలకు సంబంధించిన ఫిర్యాదులను ఒకే వేదిక ద్వారా నమోదు చేసుకునేలా ‘టీజీ-వీర్’ను రూపొందించారు. ప్రతి అమరుడి సర్వీస్ వివరాలు, కుటుంబ సమాచారం, ఇప్పటివరకు అందిన ప్రయోజనాలు, సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులను ఇందులో అందుబాటులో ఉంచారు. యూనిట్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీనియర్ అధికారులు ఫిర్యాదులను పర్యవేక్షించి, వాటి పరిష్కార పురోగతిని ట్రాక్ చేసే సదుపాయం కల్పించారు.

ఈ సందర్భంగా డీజీపీ అమరుల కుటుంబాలకు క్యూఆర్ కోడ్‌తో కూడిన ప్రత్యేక ఫ్యామిలీ కార్డులను అందజేశారు. కార్డుపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే నేరుగా ‘టీజీ-వీర్’ ఫిర్యాదు పోర్టల్‌కు వెళ్లేలా ఏర్పాటు చేశారు. ఈ పోర్టల్‌ను రూపొందించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) అధికారులకు డీజీపీ పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని అన్ని యూనిట్లకు వెంటనే సమాచారం పంపించి, అమరుల కుటుంబాల నుంచి పెండింగ్‌లో ఉన్న సమస్యలు, ఫిర్యాదులను సేకరించాలని ఆదేశించారు. వాటన్నింటినీ క్రోడీకరించి సమగ్ర నివేదిక సమర్పించాలని సూచించారు. సమావేశంలో అమరుల కుటుంబ సభ్యులు పలు దీర్ఘకాలిక సమస్యలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఎక్స్‌గ్రేషియా, ఆర్థిక సాయం, ఇంటి స్థలాల కేటాయింపు, రిజిస్ట్రేషన్ లేదా టైటిల్ సమస్యలు, పెన్షన్, ఇతర సంక్షేమ అంశాలపై పరిష్కారం కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆనంద్ వారికి హామీ ఇచ్చారు.

వరంగల్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని డీజీపీ గుర్తుచేసుకున్నారు. నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో వరంగల్ రూరల్ సబ్‌ డివిజన్‌లో ఏఎస్పీగా పోలీసు సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. ఆ రోజుల్లో పోలీసు సిబ్బంది ఎదుర్కొన్న మెరుపుదాడులు, ఎదురుకాల్పులను గుర్తుచేస్తూ.. నేడు ఈ ప్రాంతంలో నెలకొన్న శాంతి అమరుల త్యాగాల ఫలితమేనని పేర్కొన్నారు. విధినే ప్రాణాల కంటే మిన్నగా భావించి త్యాగాలు చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎప్పటికీ మరువలేమని అన్నారు.

పోలీసు అమరుల కుటుంబాల కోసం ‘టీజీ-వీర్’ పోర్టల్ ప్రారంభించిన డీజీపీ - Tholi Paluku