Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
పోలాండ్ ఉప ప్రధానితో జైశంకర్ కీలక చర్చలు

పోలాండ్ ఉప ప్రధానితో జైశంకర్ కీలక చర్చలు

Shaik Mohammad Shaffee
19 జనవరి, 2026

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల మధ్య భారత్, పోలాండ్ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పుంతలు తొక్కించే దిశగా అడుగులు వేస్తున్నాయి. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ సోమవారం న్యూఢిల్లీలో పోలాండ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక, సాంకేతిక, రక్షణ, మైనింగ్ రంగాల్లో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2024లో ప్రధాని నరేంద్ర మోడీ పోలాండ్ పర్యటన సందర్భంగా కుదిరిన 'వ్యూహాత్మక భాగస్వామ్యం'లో భాగంగా.. 2024-28 కార్యాచరణ ప్రణాళికను ఈ సమావేశంలో సమీక్షించారు.

ఆర్థిక పురోగతి.. 7 బిలియన్ డాలర్ల వాణిజ్యం

మధ్య ఐరోపాలో భారత్‌కు పోలాండ్ అత్యంత కీలకమైన వాణిజ్య భాగస్వామి అని జైశంకర్ పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 200 శాతం వృద్ధి చెంది, ప్రస్తుతం 7 బిలియన్ డాలర్లకు చేరుకుందని వెల్లడించారు. పోలాండ్‌లో భారతీయ పెట్టుబడులు 3 బిలియన్ డాలర్ల మార్కును దాటాయని, దీనివల్ల అక్కడ అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని ఆయన తెలిపారు. క్లీన్ టెక్నాలజీ, డిజిటల్ ఇన్నోవేషన్, రక్షణ రంగాల్లో పెట్టుబడులకు భారత్ కల్పిస్తున్న అవకాశాలను పోలాండ్ కంపెనీలు అందిపుచ్చుకోవాలని ఆహ్వానించారు.

ఉగ్రవాదంపై రాజీ పడొద్దు

సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ తన గళాన్ని గట్టిగా వినిపించింది. "ఉగ్రవాదం పట్ల పోలాండ్ 'సున్నా సహనం' ప్రదర్శించాలి. మా పొరుగు దేశాల్లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు లభించకూడదు" అని జైశంకర్ స్పష్టం చేశారు. దీనికి స్పందించిన సికోర్స్కీ.. ఇటీవల పోలాండ్‌లో కూడా రైలు పట్టాలను పేల్చివేసేందుకు జరిగిన ప్రయత్నాలను ప్రస్తావిస్తూ, ఉగ్రవాద నియంత్రణలో భారత్‌తో తాము ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.

ఉక్రెయిన్ వివాదం, సుంకాలపై చర్చ

ఉక్రెయిన్ యుద్ధం, దాని ప్రభావాలపై ఇరు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా భారత్‌ను లక్ష్యంగా చేసుకుని విధిస్తున్న కొన్ని ఆంక్షలు, సుంకాలపై జైశంకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. "భారత్‌ను ఇలా ఎంపిక చేసి మరీ టార్గెట్ చేయడం అన్యాయం, అనవసరం" అని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై సికోర్స్కీ స్పందిస్తూ.. ఐరోపాలో కూడా సుంకాల విషయంలో ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయని, ప్రపంచ వాణిజ్యంలో వస్తున్న మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

సాంస్కృతిక, ప్రజల మధ్య బంధాలు

భారత్–పోలండ్ మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు బలంగా ఉన్నాయని జైశంకర్ చెప్పారు. ‘మహారాజా’ (జామ్ సాహెబ్)తో అనుబంధం ఇప్పటికీ ఒక మధురమైన గుర్తుగా నిలిచిందని పేర్కొన్నారు. జామ్ సాహెబ్ మెమోరియల్ యూత్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లో పోలిష్ యువతతో జరిగిన భేటీని గుర్తు చేశారు. పోలండ్‌లో ఇండాలజీ అభ్యాసం (భారతీయ అధ్యయనాలు) కొనసాగుతుండటం, యోగా విస్తృతంగా ప్రాచుర్యం పొందడం సంతోషకరమని అన్నారు. యూరోపియన్ యూనియన్‌తో భారత్ బంధం బలపడేందుకు పోలాండ్ అందిస్తున్న మద్దతును ఈ సందర్భంగా ప్రశంసించారు.

త్వరలో భారత్‌కు పోలాండ్ ప్రధాని

పోలండ్ ఉప ప్రధాన మంత్రి సికోర్స్కీ భారత్ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటించిన తర్వాత భారత్‌కు రావడం ఇదే తొలిసారి అని చెప్పారు. భారత్, పోలండ్ రెండూ తమ తమ ప్రాంతాల్లో చురుకైన దేశాలుగా ఉన్నాయని, కొత్త అవకాశాలను కలిసి అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలోనే పోలాండ్ ప్రధాని భారత్‌లో పర్యటించే అవకాశం ఉందని సికోర్స్కీ వెల్లడించారు.

పోలాండ్ ఉప ప్రధానితో జైశంకర్ కీలక చర్చలు - Tholi Paluku