Let's talk: editor@tmv.in
పోలవరం కాలువల కాయకష్టం వైఎస్సార్‌ది.. కలరింగ్‌ చంద్రబాబుది: వైఎస్‌ షర్మిల

పోలవరం కాలువల కాయకష్టం వైఎస్సార్‌ది.. కలరింగ్‌ చంద్రబాబుది: వైఎస్‌ షర్మిల

Gaddamidi Naveen
4 సెప్టెంబర్, 2026

పోలవరం ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చేసిన కృషిని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకుంటున్నారని ఏపీ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. పోలవరం విషయంలో గతంలో భిన్నమైన వైఖరి అవలంబించిన చంద్రబాబు.. ఇప్పుడు ఉత్తరాంధ్రపై తనకు ఎంతో ప్రేమ ఉన్నట్లు, తానే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లినట్లు చెప్పుకోవడం సరికాదని ఆమె విమర్శించారు.

గురువారం ‘ఎక్స్‌’ వేదికగా షర్మిల స్పందిస్తూ.. చంద్రబాబును ‘‘అబద్ధాల పురుషోత్తముడు’’గా అభివర్ణించారు. వైఎస్సార్‌ చేపట్టిన జలయజ్ఞం కష్టాన్ని కాజేసి, తానే ఉద్ధరించినట్లు చెప్పుకోవడం ఆయనకే చెల్లిందని వ్యాఖ్యానించారు. ఒకప్పుడు జలయజ్ఞాన్ని వ్యతిరేకించి, పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకమని బహిరంగంగా చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ‘‘జలం జీవం, జీవితం’’ వంటి మాటలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్‌ జలప్రదాయినిగా గుర్తించి, ప్రాజెక్టు కోసం కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని షర్మిల పేర్కొన్నారు. 2004లోనే పోలవరానికి పరిపాలనా అనుమతులు సాధించి, రూ.2,680 కోట్ల నిధులు కేటాయించడంతో పాటు భూసేకరణ ప్రక్రియను చేపట్టారని తెలిపారు. 2009 నాటికి కాలువలకు సంబంధించిన ప్రధాన పనులను వైఎస్సార్‌ హయాంలోనే పూర్తి చేశారని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుతం పోలవరం డ్యామ్‌ పనులకంటే ముందుగా 90 శాతం కాలువల నిర్మాణంలో జరిగిన పురోగతిని ప్రజలు గుర్తించాలని షర్మిల అన్నారు. పురుషోత్తమపట్నం, పుష్కర లిఫ్ట్‌ పథకాల ద్వారా ఎత్తిపోతలతో ఎడమ కాలువలో గోదావరి జలాలు ప్రవహిస్తున్నాయంటే.. అది వైఎస్సార్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన జలయజ్ఞం ఫలితమేనని పేర్కొన్నారు.

వైఎస్సార్ హయాంలో తవ్వించిన కాలువల్లో తుప్పలు, చెత్తాచెదారం తొలగించి, కొన్ని సైఫన్లు, ఆక్విడక్ట్‌ల వద్ద చిన్న చిన్న మైనర్ పనులు చేయించి మొత్తం కాలువ తవ్వకమంతా తనదే అన్నట్లుగా చంద్రబాబు రంగులు వేసుకుంటున్నారు. తనను తాను 'అభినవ కాటన్'గా వర్ణించుకోవడం హాస్యాస్పదం. పోలవరం కాలువల కాయకష్టం వైఎస్సార్‌ది అయితే.. దానికి కలరింగ్ ఇచ్చుకోవడం చంద్రబాబు నైజం" అని షర్మిల వ్యాఖ్యానించారు. ఉత్తరాంధ్రపై ప్రేమ ఉన్నట్లు నటిస్తూ నీటిబొట్టు వెనుక ఉన్న అసలు శ్రమను మరుగున పరిచేందుకు డ్రామాలు ఆడుతున్నారని ఆమె దుయ్యబట్టారు.

పోలవరం కాలువల కాయకష్టం వైఎస్సార్‌ది.. కలరింగ్‌ చంద్రబాబుది: వైఎస్‌ షర్మిల - Tholi Paluku