
పోర్టుల అభివృద్ధే మా లక్ష్యం... ప్రైవేటీకరణ కాదు: మంత్రి జనార్ధన్ రెడ్డి
రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పన అనే లక్ష్యాలతో ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విధానంపై ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు & పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ముఖ్యంగా రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు అప్పగిస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులను విక్రయిస్తున్నారని వైఎస్సార్‌సీపీ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదని, ప్రభుత్వ హక్కులను వదులుకోవడం అసలే కాదని వివరించారు. ఈ విధానంలో పోర్టు యాజమాన్యం, భూమి, సముద్రతీర హక్కులు, భద్రత, టారిఫ్‌లు, చట్టబద్ధ నియంత్రణలు వంటి కీలక అధికారాలన్నీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు. ప్రైవేట్ భాగస్వామి కేవలం ఆపరేషన్స్ & మెయింటెనెన్స్ బాధ్యతలను మాత్రమే చూసుకుంటారని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఒప్పందాన్ని రద్దు చేసే పూర్తి హక్కు ప్రభుత్వానికి ఉంటుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, మెట్రో రైళ్లు ఈ విధానంలోనే విజయవంతంగా నడుస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్రానికి దీర్ఘకాలికంగా అత్యధిక ఆర్థిక ప్రయోజనం చేకూరేలా ఈ ఒప్పంద నిబంధనలు రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ప్రైవేట్ నిర్వాహకులు రూ. 1,500 కోట్ల ముందస్తు ప్రీమియాన్ని రెండు విడతలుగా ప్రభుత్వానికి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని, వేలంలో కోట్ చేసిన ఆదాయ వాటాతో పాటు, 20వ సంవత్సరం నుంచి ప్రతి మూడు సంవత్సరాలకు ఈ వాటా 1 శాతం చొప్పున పెరుగుతూ గరిష్టంగా 25 శాతానికి చేరుతుందన్నారు. ఏటా కనీసం రూ. 10 కోట్ల నుంచి ప్రారంభమై కాలక్రమేణా రూ. 150 కోట్ల వరకు ప్రభుత్వానికి తప్పనిసరిగా చెల్లించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ మెరిటైమ్ బోర్డు మొత్తం 19 బెర్తులపై 12 శాతం నాన్-డైల్యూటబుల్ ఈక్విటీ వాటాను శాశ్వతంగా కలిగి ఉంటుందని ఆయన తెలిపారు.
గత ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నలు
గత ప్రభుత్వం రామాయపట్నం పోర్టు పనులు 95 శాతం పూర్తయ్యాయని అబద్ధాలు ప్రచారం చేసిందని, కానీ 2024 జూన్ నాటికి కేవలం 50 శాతం పనులు మాత్రమే అయ్యాయని మంత్రి వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరో 30 శాతం పనులు పూర్తి చేసి, ప్రస్తుత పురోగతిని 80.50 శాతానికి చేర్చడమే కాకుండా భూసేకరణను కూడా పూర్తి చేసిందని తెలిపారు.
గతంలో గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న 10.4 శాతం వాటాను అదానీ గ్రూప్‌నకు విక్రయించింది, అలాగే 2023లో ఎలాంటి బహిరంగ బిడ్డింగ్ లేకుండా జేఎస్‌డబ్ల్యూ సంస్థకు రెండు బెర్తులను కేటాయించింది వైసీపి ప్రభుత్వం కాదా? అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రావడం వైసీపికి ఇష్టం లేదని, అందుకే ఈ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ సమావేశంలో పాల్గొన్న మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు మాట్లాడుతూ.. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణాన్ని 2026 డిసెంబర్ నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2,538.42 ఎకరాల్లో, 19 బెర్తులతో 138.54 ఎంఎంటీపీఏ సామర్థ్యంతో అభివృద్ధి చెందుతున్న రామాయపట్నం పోర్టు ద్వారా సుమారు రూ. 20,000 కోట్ల పెట్టుబడులు, 25 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, మ్యారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణాదిత్య తదితరులు పాల్గొన్నారు.
