Let's talk: editor@tmv.in
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్.. చర్లపల్లి జైలు నుంచి విడుదల

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్.. చర్లపల్లి జైలు నుంచి విడుదల

Gaddamidi Naveen
11 జులై, 2026

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసిన విష‌యం తెలిసిందే. రూ.1 లక్ష డిపాజిట్‌తో పాటు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు సమర్పించాలనే షరతుపై న్యాయస్థానం ఈ బెయిల్ ఇచ్చింది. హైకోర్టు జారీ చేసిన బెయిల్ ఆర్డర్ కాపీలు శుక్రవారం ఉదయం చర్లపల్లి జైలు అధికారులకు అందాయి. న్యాయపరమైన ప్రక్రియలన్నీ ముగిసిన అనంతరం, శుక్రవారం మధ్యాహ్నం బండి భగీరథ్ చర్లపల్లి జైలు నుంచి అధికారికంగా విడుదలయ్యారు. కోర్టు విధించిన షరతుల ప్రకారం ఆయన దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని, సాక్షులను ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభావితం చేయకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

బాధితురాలి ఫిర్యాదు మేరకు మొదట మే 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ బాధితురాలితో పాటు కీలక సాక్షుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. బాధితురాలు ఇచ్చిన వివరాల ఆధారంగా పోలీసులు ఈ కేసులో సెక్షన్లను మార్చారు. బారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 64(2)(m), పోక్సో చట్టం-2012 లోని సెక్షన్ 5(1) r/w 6 కింద కఠినమైన సెక్షన్లను చేర్చారు. ఆ తర్వాత భగీరథ్ మే 29 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

భగీరథ్ తరఫు న్యాయవాది కరుణాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పోలీసులకు లొంగిపోవడానికి ముందే, కఠిన సెక్షన్లు నమోదు కావడంతో అతను తప్పించుకు తిరిగాడు. దీంతో పోలీసులు కరీంనగర్, ఢిల్లీ సహా పలు నగరాల్లోని అతని స్నేహితుల నివాసాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు. అతను దేశం విడిచి పారిపోకుండా 'లుకౌట్ సర్క్యులర్' కూడా జారీ చేశారు. మే 16న నిందితుడు పోలీస్ అకాడమీ సమీపంలో ఉన్నట్లు అందిన నమ్మకమైన సమాచారంతో నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల టెక్ పార్క్ వద్ద పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 8:15 గంటలకు భగీరథ్‌ను పట్టుకుని వెంటనే పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

రాజకీయ వివాదం

ఈ కేసు తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిది రోజుల పాటు బండి భగీరథ్‌ను కాపాడారని, పోలీసుల చర్యల్లో ఎందుకు ఆలస్యమైందో సమాధానం చెప్పాలని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు.

ట్యాగ్‌లు
BandiBhageerathTelanganaHighCourtBailGrantedPOCSOCaseTelanganaNewsHyderabadNewsBreakingNewsBandiSanjayLegalUpdateCourtVerdict
పోక్సో కేసులో బండి భగీరథ్‌కు బెయిల్.. చర్లపల్లి జైలు నుంచి విడుదల - Tholi Paluku