Let's talk: editor@tmv.in
పొగాకు రైతులకు కేంద్రం–ఏపీ ప్రభుత్వాల రూ. 188 కోట్ల సహాయం: మంత్రి అచ్చెన్నాయుడు

పొగాకు రైతులకు కేంద్రం–ఏపీ ప్రభుత్వాల రూ. 188 కోట్ల సహాయం: మంత్రి అచ్చెన్నాయుడు

Gaddamidi Naveen
30 జులై, 2026

పొగాకు రైతులకు మద్దతుగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా రూ.188 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. 94 మిలియన్ కిలోల ఎఫ్‌సీవీ పొగాకు కొనుగోలుకు కిలోకు రూ.20 చొప్పున ప్రోత్సాహక సాయం అందిస్తామని తెలిపారు. ఈ కొనుగోలు ప్రక్రియను రానున్న కొద్ది రోజుల్లో ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.

బుధవారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కేంద్రాన్ని ఒప్పించి ఈ ప్రత్యేక సాయాన్ని సాధించగలిగిందని పేర్కొన్నారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా కొనుగోలు ప్రక్రియను వేగంగా పూర్తి చేస్తామని చెప్పారు.

ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ఎఫ్‌సీవీ పొగాకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అచ్చెన్నాయుడు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు, బ్రెజిల్, టాంజానియా వంటి దేశాల నుంచి తక్కువ ధరలకు పొగాకు మార్కెట్లోకి రావడం, అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రతికూల పరిస్థితులు ఉండటం వల్ల రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదన్నారు. ఈ నేపథ్యంలో రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం, టొబాకో బోర్డు, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు. అలాగే పొగాకు కంపెనీలు, వ్యాపారులు రైతుల నుంచి కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

గతంలో కూడా ధరలు కుప్పకూలిన సమయంలో టీడీపీ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని మంత్రి గుర్తు చేశారు. 2014–15లో ఎఫ్‌సీవీ పొగాకు ధరలు పడిపోయినప్పుడు కిలోకు రూ.20 చొప్పున సాయం అందించామని, 2014 నుంచి 2019 మధ్య హెచ్‌డీ బర్లీ పొగాకును 25 మిలియన్ కిలోల మేర రూ.270 కోట్లతో కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామని పేర్కొన్నారు.

అనంతరం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై మంత్రి విమర్శలు గుప్పించారు. 2019 నుంచి 2024 మధ్య కేవలం 11 మిలియన్ కిలోల పొగాకును మాత్రమే కొనుగోలు చేసి రైతులకు తగిన మద్దతు ఇవ్వలేకపోయిందని ఆరోపించారు. రైతులకు మేలు చేసే సూచనలను ఏ రాజకీయ పార్టీ నుంచి వచ్చినా ప్రభుత్వం స్వాగతిస్తుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అయితే వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు పొగాకు రైతుల్లో ఆందోళన కలిగించడంతో పాటు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. రైతులకు నష్టం కలిగించే వ్యాఖ్యల కంటే వారి సంక్షేమానికి ఉపయోగపడే సూచనలు చేయాలని జగన్‌కు సూచించారు.

ట్యాగ్‌లు
APFarmersTobaccoFarmersFCVTobaccoAndhraPradeshAgricultureFarmersWelfareTDPNDAGovernmentTobaccoBoard
పొగాకు రైతులకు కేంద్రం–ఏపీ ప్రభుత్వాల రూ. 188 కోట్ల సహాయం: మంత్రి అచ్చెన్నాయుడు - Tholi Paluku