
‘పొగ’కు కేంద్రం అదనపు సెగ
ఆరోగ్య పరిరక్షణతో పాటు పన్ను వసూళ్లను పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పొగాకు ఉత్పత్తులు ఇప్పడు మరింత ప్రియం కానున్నాయి. దేశంలో పొగాకు ఉత్పత్తులను వినియోగించేవారిని, సాగుచేసేవారిని నిరుత్సహాపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎక్సైజ్ (సవరణ) బిల్లు-2025కు పార్లమెంట్ గురువారం ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతం 84 ఎంఎం కింగ్ సైజ్ గోల్డ్ ఫ్యాక్ ధర రూ.160 నుంచి 170 ఉండేది. ఇప్పుడు దీని ధర 180–190కి పైగా పెరిగే అవకాశం ఉంది. జీఎస్టీ అమలు తర్వాత, పొగాకు వంటి డీమెరిట్ ఐటెంలపై పన్ను భారం తగ్గకుండా చూసేందుకు ఈ బిల్లును తెచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ నిర్ణయం వల్ల సిగరెట్లు, బీడీలు, గుట్కా, తంబాకు పాకెట్‌ల ధరలు మరింత పెరగనున్నాయి. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే పొగాకు వినియోగాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. దేశంలో ప్రతి ఏడాది లక్షలాది మంది పొగాకు వినియోగంతో సంబంధిత వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో, ఈ నిర్ణయం ప్రజారోగ్యానికి మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
పొగాకు సంబంధిత ఉత్పత్తులపై జీఎస్టీ కంపెన్సేషన్ సెస్ ముగిసినా అధికంగా పన్ను విధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం కేంద్ర ఎక్సైజ్ (సవరణ) బిల్లు-2025కు పార్లమెంట్ గురువారం ఆమోదం తెలిపింది. దీంతో ఆపద సమయంలో ఖర్చు చేయడానికి సిగరెట్, పొగాకు మీద ప్రభుత్వం వేసే అదనపు పన్నును పొగాకు వినియోగదారులపై వేసింది.
రాజ్యసభ ఈ బిల్లును వాయిస్ ఓట్‌తో లోక్‌సభకు తిరిగి పంపింది. ఈ సందర్భంగా రాజ్యసభలో చర్చకు సమాధానమిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, బిల్లులోని వివిధ నిబంధనలను వివరించారు. పొగాకు సాగు తగ్గించేందుకు రైతులను ఇతర వాణిజ్య పంటల వైపు మళ్లిస్తున్నామన్నారు.
10 రాష్ట్రాల్లో పొగాకు నుంచి లక్ష ఎకరాలు దూరం
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో లక్ష ఎకరాల భూమిని పొగాకు సాగు నుంచి ప్రత్యామ్నాయ పంటలకు మార్చుతున్నట్లు మంత్రి తెలిపారు. జీఎస్టీ వ్యవస్థలో పొగాకు ఇంకా ‘డిమెరిట్’ వర్గంలోనే ఉండి 40 శాతం పన్ను కొనసాగుతుందని భరోసా ఇచ్చారు.
బిల్లులో ప్రధాన ప్రతిపాదనలు:
• ముడి పొగాకు పై 60–70శాతం ఎక్సైజ్ డ్యూటీ
• సిగార్లు, చుట్ట: 25శాతం లేదా 1,000 స్టిక్స్‌కు రూ.5,000
• సిగరెట్లు: పొడవు, ఫిల్టర్‌ను బట్టి 1,000 స్టిక్స్‌కు రూ.2,700–రూ.11,000
• నమిలే పొగాకు : కిలోకు రూ.100 పెంచారు.
పొగాకు ఉత్పత్తుల ‘మోసపూరిత’ ప్రకటనలపై నిషేధం విధించాలి:రాజ్యసభ
పొగాకు, మద్యం వంటి మత్తు పదార్థాల ప్రకటనల ద్వారా జనాలను మోసం చేస్తున్న ‘మోసపూరిత’ ప్రకటనలను వెంటనే నిషేధించాలని రాజ్యసభ సభ్యులు గురువారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ పదార్థాల వల్ల క్యాన్సర్‌తో సహా ఇతర వ్యాధులతో ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి ‘సెంట్రల్ ఎక్సైజ్ (సవరణ) బిల్లు-2025’ చర్చ సమయంలో సభ్యులు మాట్లాడారు. జీఎస్టీ కంపెన్సేషన్ సెస్ ముగిసిన తర్వాత పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని భారీగా పెంచేందుకు ఈ బిల్లును రాజ్యసభలో గురువారం ప్రవేశపెట్టారు.
అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
బిజెపి సభ్యుడు సంజయ్ సేథ్ మాట్లాడుతూ పురుషులు, మహిళలు, పిల్లలు కూడా పొగాకు ఉత్పత్తులు వాడుతున్నారని, దీంతో క్యాన్సర్, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు పెరుగుతున్నాయని అన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం దేశంలో ఏటా 13.5 లక్షల మంది ఈ వ్యాధులతో మరణిస్తున్నారని చెప్పారు. గుట్కా, మద్యం ప్రకటనలు సోడా, నీళ్ల బాటిల్స్ పేరుతో చేస్తున్నారు. ఈ హానికర ఉత్పత్తుల ప్రకటనలు ప్రభుత్వం నిషేధించినా, మోసపూరితంగా ప్రజల మస్తిష్కంలోకి ఎక్కిస్తున్నారు. వెంటనే ఇలాంటి ప్రకటనలు నిలిపివేయాలని సంజయ్ సేథ్ డిమాండ్ చేశారు. ఈ బిల్లు ద్వారా వచ్చే ఆదాయంలో కొంత శాతాన్ని క్యాన్సర్ పరిశోధన, అవగాహన కార్యక్రమాలకు కేటాయించాలని కోరారు.
పొగాకు ఉత్పత్తులు అమ్మడానికి లైసెన్స్ పెట్టాలి
బీఎస్పి సభ్యుడు రామ్‌జీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, పాన్ మసాలా పేరుతో గుట్కాను రహస్యంగా ప్రచారం చేసే అన్ని మోసపూరిత ప్రకటనలను నిలిపివేయాలన్నారు. క్యాన్సర్ బారిన పడిన వారి వీడియోలతో టీవీల్లో అవగాహన కార్యక్రమాలు ప్రసారం చేయాలని, సినిమా నటీనటులు పొగాకు ఉత్పత్తులను ప్రమోట్ చేయడంపై పూర్తి నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. గుట్కా, సిగరెట్ల అమ్మకందారులకు కూడా మద్యం షాపుల్లా లైసెన్స్ తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు.
బిజెపి సభ్యుడు గోవింద్‌భాయ్ లాల్జీభాయ్ ధోలాకియా సంస్కృత శ్లోకంతో ప్రసంగం ప్రారంభించి, తన శ్రీ రామకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ సంస్థలో 7,000 మంది ఉద్యోగులు ఉన్నా ఒక్కరూ పొగాకు వాడరని, దేశం మొత్తం పొగాకు రహితంగా మారాలని ఆకాంక్షించారు.
ఏఐఏడిఎంకె సభ్యుడు ఎం. తంబిదురై బిల్లుకు మద్దతు ప్రకటిస్తూ, రాష్ట్రాలకు వాటా సక్రమంగా ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ సభ్యురాలు జెబి మాథర్ హిషాం మాట్లాడుతూ దేశంలో పొగాకు వల్ల ఏటా 10 లక్షలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయని, రోజుకు 2,500 మంది చనిపోతున్నారని చెప్పారు. అయినా ఈ బిల్లు ద్వారా ‘సిన్ టాక్స్’ పెంచి పొగాకు వినియోగం తగ్గించాలనున్నట్లు చెబుతున్నా, నిజానికి జీఎస్టీ అమలులో లోపాల వల్ల వచ్చిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేయడమే దీని వెనుకు ఉన్న అసలు లక్ష్యమని ఆరోపించారు.
బిజెపి సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి భగవత్ కరాడ్ మాత్రం ఈ బిల్లు ఆరోగ్య విధానాన్ని బలోపేతం చేస్తూ క్యాన్సర్, గుండె జబ్బులు తగ్గించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ బిల్లు బుధవారం లోక్‌సభలో వాయిస్ ఓటుతో ఆమోదం పొందింది. జీఎస్టీ కంపెన్సేషన్ సెస్ ముగిసిన తర్వాత పొగాకు ఉత్పత్తులపై 60-70 శాతం వరకు ఎక్సైజ్ డ్యూటీ విధించే అవకాశం ఈ బిల్లు కల్పిస్తుంది.
హిందీలో ప్రసంగించానని విమర్శ?
జీఎస్టీ కంపెన్సేషన్ సెస్ స్థానంలో హెల్త్ సెక్యూరిటీ–నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్లుపై లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా హిందీలో ప్రసంగించానని అభ్యంతరం వ్యక్తం చేసిన టీఎంసీ ఎంపీ సౌగతో రాయ్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తీవ్రంగా విమర్శించారు.
భాషకు హద్దులు లేవు
చర్చలో జోక్యం చేసుకున్న సీతారామన్ ఘాటుగా స్పందిస్తూ నేను హిందీలో మాట్లాడినా, తమిళం,తెలుగులో మాట్లాడినా, ఇంగ్లీషులో మాట్లాడినా సభ్యుడికి ఏమి సమస్య? అనువాద సౌకర్యం ఉంది. అందుబాటులో ఉన్నప్పుడు ఇలాంటి అభ్యంతరాలు ఎందుకు? అని ప్రశ్నించారు. బిల్లుపై దృష్టి మళ్లించేందుకే రాయ్ ఇలా చేస్తున్నారన్నారు. బిల్లును పూర్తిగా చదవకుండా, విషయాన్నే తిప్పేస్తున్నారు. ఈ వ్యాఖ్యలకు నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాను. ఇవి రికార్డులో నిలవాలి అని ఆమె స్పష్టం చేశారు. ఈ బిల్లు ద్వారా జాతీయ ప్రాధాన్యతగల రెండు రంగాలైన ఆరోగ్యం, జాతీయ భద్రతకు నిధులు నిరంతరం అందేలా ఏర్పాటు చేయడమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు.
రాయ్ మాట్లాడుతూ మేం బెంగాలీ. హిందీ అంతగా రాదు. అందుకే నిర్మలా జీ ఏమి మాట్లాడారో అర్థం కాలేదు అని వ్యాఖ్యానించారు.
తక్షణమే సభాధ్యక్ష బాధ్యతలు వహిస్తున్న జగదంబికా పాల్ జోక్యం చేసుకుని, సభా కార్యక్రమాలు పార్లమెంట్ యాప్‌లో అనేక భాషల్లో అందుబాటులో ఉన్నాయని గుర్తుచేశారు. మీరు బెంగాలీలే కానీ హిందీ గురించి అలా మాట్లాడకూడదు అని పాల్ హెచ్చరించారు.
