Let's talk: editor@tmv.in
పేదల ఇళ్లపై రేవంత్ సర్కార్‌ బుల్డోజర్లతో యుద్ధం: హరీష్ రావు

పేదల ఇళ్లపై రేవంత్ సర్కార్‌ బుల్డోజర్లతో యుద్ధం: హరీష్ రావు

Gaddamidi Naveen
14 మార్చి, 2026

మూసీ ప్రాజెక్టు పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను రోడ్డున పడేస్తోందని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రంగా విమ‌ర్శించారు. గల్ఫ్ దేశాల్లో యుద్ధం వల్ల ఇళ్లు కూలిపోతుంటే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో యుద్ధం చేస్తోందని ఆయ‌న‌ ధ్వజమెత్తారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, గల్ఫ్ దేశాల్లో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో బాంబులు కూలుతున్నప్పుడు, తెలంగాణలో రేవంత్ రెడ్డి 10,017 ఇండ్లను బుల్డోజర్లతో కూల్చుతున్నాడు హరిష్ రావు పేర్కొన్నారు. మూసీ ప్రక్షాళనపై కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం కాకుండానే ఇళ్లు ఎలా కూలుస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. డీపీఆర్ తయారు చేయడానికి 18 నెలల సమయం పడుతుందని గత జనవరిలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నివేదిక లేకుండానే 10,017 ఇళ్లను కూల్చివేసి, 3,279 ఎకరాల భూమిని సేకరిస్తామని గెజిట్ నోటిఫికేషన్ ఎలా ఇస్తారని నిలదీశారు. కేవలం గాంధీ విగ్రహం పెట్టడం కోసం వేలాది ఇళ్లను కూల్చడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

రియల్ ఎస్టేట్ దందా?

ఇప్పటికే 'హైడ్రా' పేరుతో లక్షలాది మందిలో భయం నింపిన ప్రభుత్వం, ఇప్పుడు మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తోందని ఆరోపించారు. మూసీని నిజంగా శుద్ధి చేస్తారా లేక ఆ ప్రాంతంలో వ్యాపారం చేస్తారా అని నిలదీశారు. ఈ దోపిడీకి బీజేపీ సహకరిస్తోందా అని ప్రశ్నిస్తూ, ఆ పార్టీ బాధితుల పక్షమా లేక రేవంత్ పక్షమా అని అడిగారు. పేదల ఇళ్లు కూల్చి వారికి నిద్రలేని రాత్రులు మిగల్చవద్దని, దమ్ముంటే డీపీఆర్‌ను ప్రజల ముందు పెట్టాలని హరీష్ రావు సవాల్ విసిరారు.

రాహుల్ గాంధీకి హరీష్ రావు బహిరంగ లేఖ

బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన దానం నాగేందర్ వ్యవహారంపై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి శుక్ర‌వారం ఆయన ఒక ఘాటైన లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న "ద్వంద్వ విధానాలను" హరీష్ రావు ఈ లేఖలో ఎండగట్టారు.

దేశవ్యాప్తంగా పర్యటిస్తూ రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రగల్భాలు పలికే రాహుల్ గాంధీ, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై ఎందుకు మౌనంగా ఉన్నారని హరీష్ రావు ప్రశ్నించారు. పార్లమెంటులో, బహిరంగ సభల్లో మీరు రాజ్యాంగ విలువల గురించి లెక్చర్లు ఇస్తారు. మీ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ తెలంగాణలో మీ పార్టీ అధికారంలో ఉన్నచోట అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు అని విమర్శించారు.

బీఆర్ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్, కాంగ్రెస్ పార్టీ అధికారిక 'బి-ఫామ్'తో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం బహిరంగ సత్యమని హరీష్ రావు గుర్తుచేశారు. ఇది కేవలం పుకారు కాదని, బహిరంగ రికార్డు అని పేర్కొన్నారు. మరో పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ బి-ఫామ్‌పై పోటీ చేయడం ఫిరాయింపు కాకపోతే, పదో షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపు అంటే ఇంకేమిటి? అని ఆయన రాహుల్ గాంధీని నిలదీశారు. అసెంబ్లీ స్పీకర్ దీనికి సంబంధించి తగిన ఆధారాలు లేవు అని అనడం రాజ్యాంగ నైతికతకు విరుద్ధమని ఆక్షేపించారు. రాజ్యాంగం రక్షణ ఈ విధంగా చేయబడుతుందా? అని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేతగా ఇప్పటికే స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని, కానీ ప్రభుత్వం ఫిరాయింపుదారులను రక్షించే ప్రయత్నం చేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ రాజ్యాంగం గురించి మాట్లాడుతోందా అని ఆయన ప్రశ్నించారు. కేవలం ఉపన్యాసాలతో రాజ్యాంగాన్ని కాపాడలేరు. దానం నాగేందర్‌పై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద తక్షణమే చర్యలు తీసుకోవాలని మీ ముఖ్యమంత్రికి, స్పీకర్‌కు మీరు సలహా ఇస్తారా? లేక మీ రాజకీయాలకు అనుకూలంగా ఉన్నప్పుడే రాజ్యాంగం గురించి మాట్లాడతారా? దీనిపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి అని హరీష్ రావు తన లేఖలో డిమాండ్ చేశారు.

పేదల ఇళ్లపై రేవంత్ సర్కార్‌ బుల్డోజర్లతో యుద్ధం: హరీష్ రావు - Tholi Paluku