Let's talk: editor@tmv.in
పేదరికం, కులం చదువుకు అడ్డంకులు కావు: మాజీ మంత్రి హరీశ్‌రావు

పేదరికం, కులం చదువుకు అడ్డంకులు కావు: మాజీ మంత్రి హరీశ్‌రావు

Gaddamidi Naveen
10 ఆగస్టు, 2026

పేదరికం, కులం చదువుకు అడ్డంకులు కావని, విద్యార్థులు పట్టుదలతో కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ (న్యూస్) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన దళిత విద్యార్థులకు అవార్డులు అందజేసి ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ వంటి మహనీయులు సాధించిన రిజర్వేషన్ల ఫలితంగానే ఎంతోమంది విద్యావంతులై ఉన్నత స్థానాలకు చేరుకున్నారని అన్నారు. సమాజం తమకు ఏమిచ్చిందని కాకుండా, తాము సమాజానికి ఏమి చేయగలమని ఆలోచిస్తూ న్యూస్ సొసైటీ ఉద్యోగులు వేతనం నుంచి నెలకు రూ.1,000 చొప్పున విరాళంగా ఇచ్చి రూ.10 లక్షల నిధి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.

పేద విద్యార్థులకు అండగా నిలిచిన రోహిత్, శ్రీజ ఉదాహరణలను ఆయన ప్రస్తావించారు. రోహిత్ తన తొలి ఏడాది జీతం రూ.6 లక్షలను పేద విద్యార్థుల కోసం అందించడం స్ఫూర్తిదాయకమన్నారు. ఎంబీబీఎస్ చదువుతున్న శ్రీజ రెండో సంవత్సరం ఫీజును తానే చెల్లిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు సాధించి ఫీజులు చెల్లించలేని దళిత విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. న్యూస్ సొసైటీకి రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో రూ. 5,403 కోట్లు కేటాయించి, కేవలం రూ. 74 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, అది కూడా జీతాలు, కరెంట్ బిల్లులకే సరిపోయిందని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు రోడ్డున పడుతున్నారని, కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో రూ. 19,000 కోట్లు చెల్లించామని గుర్తుచేశారు. దళితబంధు కింద 12 లక్షలు ఇస్తామని చెప్పి, బడ్జెట్ లో 2000 కోట్లు పెట్టి.. ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి సహాయం చేశారా? ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ నిధులు ల్యాప్స్ కావొద్దని, క్యారీ ఫార్వర్డ్ కావాలని మేము చట్టం తెస్తే ఈ ప్రభుత్వం 2024-25 లో 33 వేల కోట్లు ఎస్సీ నిధి కింద చూపి, ఖర్చు చేసింది కేవలం 14 వేల కోట్లే. అందులో పెన్షన్లు అన్నీ కలిపి ఖర్చుగా చూపిస్తున్నారని ఆయ‌న తెలిపారు.

విద్యార్థుల హక్కులు, నిధుల కోసం అసెంబ్లీలో పోరాడతామని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో నాలుగైదేళ్లు కష్టపడి చదివి తల్లిదండ్రులు, సిద్దిపేట గర్వపడేలా ఎదగాలని ఆకాంక్షించారు.

పేదరికం, కులం చదువుకు అడ్డంకులు కావు: మాజీ మంత్రి హరీశ్‌రావు - Tholi Paluku