

పెన్నా నదిపై రూ.91 కోట్లతో భారీ వంతెన నిర్మాణం
ఏపీలోని అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం బూదిగుమ్మ వద్ద పెన్నా నదిపై రూ.91 కోట్ల వ్యయంతో చేపట్టిన భారీ వంతెన నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో వివరాలను వెల్లడించారు. గత మూడు నెలలుగా నదిలో నీరు నిల్వ ఉన్నప్పటికీ భారీ యంత్రాలను వినియోగిస్తూ ఫైల్ ఫౌండేషన్ విధానంలో నిర్మాణ పనులను చురుగ్గా చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వంతెనకు ఇరువైపులా ఆరు కిలోమీటర్ల మేర రహదారులను కూడా నిర్మించనున్నట్లు తెలిపారు.
ఈ వంతెన నిర్మాణం పూర్తయితే అనంతపురం నుంచి కూడేరు, బెళుగుప్ప మీదుగా రాయదుర్గానికి వెళ్లే ప్రయాణికులకు సుమారు 20 కిలోమీటర్ల దూరం తగ్గనుంది. దీంతో ప్రయాణ సమయం, రవాణా ఖర్చులు ఆదా కానున్నాయి. పరిసర ప్రాంతాల్లోని 20కి పైగా గ్రామాల రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించేందుకు అవకాశం కలుగుతుంది. దశాబ్దాలుగా ఆయా ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న రవాణా సమస్యలకు ఈ వంతెన నిర్మాణంతో శాశ్వత పరిష్కారం లభించనుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తోందని పేర్కొన్నారు.
