Let's talk: editor@tmv.in
పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి కేసీఆర్ పరామర్శ

పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి కేసీఆర్ పరామర్శ

Gaddamidi Naveen
10 ఆగస్టు, 2026

ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం పరామర్శించారు. వరంగల్‌ జిల్లా నల్లబెల్లిలో నిర్వహించిన సుదర్శన్‌రెడ్డి దశదినకర్మ కార్యక్రమానికి కేసీఆర్‌ హాజరయ్యారు. తొలుత సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఆయన.. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కూడా కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేసీఆర్‌ నల్లబెల్లికి వస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సుదర్శన్‌రెడ్డి నివాసం వద్ద కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. నర్సంపేటకు వెళ్తున్న కేసీఆర్‌కు మార్గమధ్యంలోనూ పలుచోట్ల పార్టీ నాయకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్‌ వెంట పార్టీ సీనియర్‌ నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

పెద్ది కుటుంబానికి ఆర్థికంగా చేయూత అందించేందుకు పార్టీ తరఫున రూ.2.25 కోట్ల మేర ఆర్థిక భరోసా కల్పించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి రూ.2.25 కోట్ల చెక్కును కేసీఆర్ అందజేశారు. అలాగే, పెద్ది సుదర్శన్ రెడ్డి అమ్మ అమృతమ్మ సంక్షేమం కోసం రూ.25 లక్షలు బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. పిల్లల బాగోగులు, చదువలు, కుటుంబ సంక్షేమాన్ని తాము ఎల్లవేళలా పర్యవేక్షిస్తామని కేసీఆర్ మాటిచ్చారు. అనంతరం నల్లబెల్లి నుంచి కేసీఆర్ సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫాంహౌస్‌కు బయలుదేరారు.

పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి కేసీఆర్ పరామర్శ - Tholi Paluku