Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
పెదవడ్లపూడిలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

పెదవడ్లపూడిలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్

Panthagani Anusha
9 మార్చి, 2026

మంగళగిరి నియోజకవర్గ రైతాంగం చిరకాల కళ నెరవేరింది. సాగునీటి వనరుల అభివృద్ధిలో భాగంగా పెదవడ్లపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం ఘనంగా ప్రారంభించారు. రూ.14.88 కోట్ల భారీ వ్యయంతో పూర్తి చేసిన ఈ ప్రాజెక్టు మంత్రి రిబ్బన్ కట్ చేసి అనంతరం స్విచ్ ఆన్ చేయడం ద్వారా పంపుల నుంచి నీటి పంపిణీని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.

మూడు నియోజకవర్గాలకు జలకళ

ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 250 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసే సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. దీనికోసం అత్యాధునిక సాంకేతికతతో కూడిన నాలుగు పంపులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాగా ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం మంగళగిరి మాత్రమే కాకుండా, పొరుగున ఉన్న తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లోని సుమారు 25,344 ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సౌకర్యం లభించనుంది. నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న వేలాది మంది రైతులకు ఈ పథకం ఒక వరప్రదాయినిగా మారనుంది.

మాట నిలబెట్టుకున్నాం.. రైతులకు అండగా ఉంటాం

ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. గతంలో నిధుల లేమితో నిలిచిపోయిన ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రత్యేక చొరవతో పూర్తి చేశామని తెలిపారు. ఈ పథకం ద్వారా సాగునీటి సమస్యలు తొలగి, పంటల దిగుబడి పెరగడం వల్ల రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా మంత్రి లోకేష్ రాకతో పెదవడ్లపూడి గ్రామంలో సందడి నెలకొంది. స్థానిక నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ ఎత్తున తరలివచ్చి మంత్రికి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి, గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పెదవడ్లపూడిలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్ - Tholi Paluku