
పెదపెంకి అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలు.. కాంట్రాక్టర్‌పై చర్యలకు డిప్యూటీ సీఎం ఆదేశం
పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపాలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. నిర్మాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని కాంట్రాక్టర్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా, సదరు పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే నిలిపివేయాలని జిల్లా కలెక్టర్‌తో పాటు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.
పెదపెంకి గ్రామంలో కొత్తగా నిర్మించిన కొన్ని సిమెంట్ రోడ్లలో పగుళ్లు ఏర్పడినట్లు డిప్యూటీ సీఎం దృష్టికి రావడంతో, ఆయన రాష్ట్ర స్థాయి చీఫ్ క్వాలిటీ కంట్రోల్ అధికారిని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపించారు. అధికారుల తనిఖీల్లో ఐదు సీసీ రోడ్ల నిర్మాణంలో తీవ్ర నాణ్యతా లోపాలు ఉన్నట్లు వెల్లడైంది. క్వాలిటీ కంట్రోల్ బృందం సమర్పించిన అధికారిక నివేదిక ఆధారంగా కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
ఈ సందర్భంగా పెదపెంకిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గ్రామంలో చేపట్టిన రోడ్లు, మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక సదుపాయాలు అందించడంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదని, అన్ని రకాల అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అలాగే, పెదపెంకి అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించే బాధ్యతను స్థానిక శాసనసభ్యులు (ఎమ్మెల్యే) కూడా తీసుకోవాలని డిమాండ్ చేశారు.
