
పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన
తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు పయనమయ్యారు. అక్కడ జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఆయన నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం శంషాబాద్ విమానాశ్రయం నుంచి దావోస్ కు బయలుదేరింది.
ముఖ్యమంత్రితో పాటు ఈ పర్యటనలో రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జయేష్ రంజన్, సంజయ్ కుమార్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు. జనవరి 20న ప్రారంభమయ్యే ఈ నాలుగురోజుల సమావేశంలో ముఖ్యమంత్రి, గ్లోబల్ కార్పొరేషన్ల సీఈఓలు, అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృతమైన సమావేశాలు నిర్వహించనున్నారు.
దావోస్ లో తెలంగాణ పావిలియన్‌లో, ముఖ్యమంత్రి ప్రముఖ అంతర్జాతీయ సంస్థల నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు జరపనున్నారు. వీటిలో గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలీవర్, హనీవెల్, లోరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డిపి వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.
ఈ సమావేశాల ప్రధాన లక్ష్యం తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించడం, పరిశ్రమల విస్తరణను ప్రోత్సహించడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లైఫ్ సైన్సెస్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ప్రపంచ వేదికపై శక్తివంతంగా ప్రదర్శించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణకు ఉన్న వ్యూహాత్మక ప్రయోజనాలను, సుస్థిర వృద్ధి అవకాశాలను వివరించడం ద్వారా గ్లోబల్ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని చూరగొనాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ దావోస్ పర్యటన ద్వారా రాబోయే సంవత్సరాల్లో తెలంగాణకు భారీగా పెట్టుబడులు ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక కీలకమైన విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రణాళికను రూపొందించింది.
2025లో జరిగిన దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల్లో తెలంగాణ ఏకంగా రూ. 1.78 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో మరిన్ని అంతర్జాతీయ ఒప్పందాలను కుదుర్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.
