
పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘ఇన్వెస్ట్ కడప’ కేంద్రం
జిల్లాకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో కడప జిల్లా యంత్రాంగం ‘ఇన్వెస్ట్ కడప’ పేరుతో ప్రత్యేక పెట్టుబడుల సదుపాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ద్వారా పెట్టుబడిదారులకు అవసరమైన సమాచారం, ప్రభుత్వ అనుమతులు, భూమి వివరాలు తదితర సేవలను ఒకే వేదికపై అందించనున్నారు.
పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడం, వివిధ ప్రభుత్వ శాఖల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సింగిల్ విండో విధానంలో సేవలు అందించడం ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశమని జిల్లా యంత్రాంగం బుధవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్నారు. పెట్టుబడిదారులు, ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడంతో పాటు ప్రాజెక్టుల అమలులో ఎదురయ్యే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టనున్నారు.
ఐదు విభాగాలతో సేవలు
‘ఇన్వెస్ట్ కడప’ కేంద్రం ప్రధానంగా ఐదు కీలక విభాగాల ద్వారా పనిచేయనుంది. ల్యాండ్ బ్యాంక్ డెస్క్, ఆపర్చునిటీస్ డెస్క్, ఇన్వెస్టర్ హ్యాండ్‌హోల్డింగ్ టీమ్, డిపార్ట్‌మెంటల్ కన్వర్జెన్స్, ప్రాజెక్ట్ ట్రాకింగ్ అండ్ ఫెసిలిటేషన్ విభాగాలు పెట్టుబడిదారులకు సహకరించనున్నాయి.
ల్యాండ్ బ్యాంక్ డెస్క్ ద్వారా జిల్లాలో అందుబాటులో ఉన్న భూములపై డిజిటల్ డేటాబేస్‌ను నిర్వహిస్తారు. భూమి ఉన్న ప్రాంతం, విస్తీర్ణం, రవాణా సౌకర్యాలు, పరిశ్రమలకు అనుకూలత వంటి వివరాలను అందులో పొందుపరుస్తారు. అవసరమైనప్పుడు పెట్టుబడిదారులకు స్థల పరిశీలన, క్షేత్రస్థాయి పర్యటనలను కూడా సమన్వయం చేస్తారు. ఆపర్చునిటీస్ డెస్క్ ద్వారా ప్రాధాన్య, అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడి అవకాశాలను గుర్తించి వాటిని పెట్టుబడిదారులతో అనుసంధానిస్తారు. తయారీ, గనులు, సౌర, పవన విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, పర్యాటకం, రియల్ ఎస్టేట్ తదితర రంగాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఇన్వెస్టర్ హ్యాండ్‌హోల్డింగ్ టీమ్ పెట్టుబడిదారుల అవసరాలను తెలుసుకుని, అనువైన ప్రాంతాలను గుర్తించడం, స్థల సందర్శనలను ఏర్పాటు చేయడం, వివిధ శాఖలతో సమన్వయం చేయడం వంటి సేవలను అందిస్తుంది. డిపార్ట్‌మెంటల్ కన్వర్జెన్స్ కింద సంబంధిత శాఖల నోడల్ అధికారులు ఒకే వేదికపై పనిచేస్తూ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయనున్నారు.
ప్రాజెక్టుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ
ప్రాజెక్ట్ ట్రాకింగ్ అండ్ ఫెసిలిటేషన్ విభాగం పెట్టుబడి ప్రతిపాదనను ప్రారంభ దశ నుంచి ప్రాజెక్టు ప్రారంభమయ్యే వరకు పర్యవేక్షిస్తుంది. భూమి, అనుమతులు, క్లియరెన్స్‌లు, మౌలిక వసతులు తదితర అంశాల్లో ఎదురయ్యే సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. వ్యవసాయం, ఆహార శుద్ధి, గనులు, ఖనిజ ఆధారిత పరిశ్రమలు, తయారీ, సౌర, పవన, పునరుత్పాదక ఇంధనం, పంప్డ్ స్టోరేజ్, పర్యాటకం, ఆతిథ్య రంగం, రియల్ ఎస్టేట్, మౌలిక వసతులతో పాటు ఇతర అభివృద్ధి చెందుతున్న రంగాల్లో పెట్టుబడులకు కేంద్రం ప్రోత్సాహం ఇవ్వనుంది.
కేంద్రంలో ఏర్పాటు చేసిన కియోస్క్ ద్వారా కడప పారిశ్రామిక సామర్థ్యం, పెట్టుబడి అవకాశాలు, ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర డిజిటల్ సమాచారాన్ని కూడా పెట్టుబడిదారులకు అందుబాటులో ఉంచనున్నారు. భూమి వివరాలు, పెట్టుబడి అవకాశాలు, పెట్టుబడిదారుల సహకారం, శాఖల సమన్వయం, ప్రాజెక్టుల పర్యవేక్షణను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా ప్రక్రియలో జాప్యాలను తగ్గించి పారదర్శకత, సమర్థతను పెంచాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది.
‘ఇన్వెస్ట్ కడప’ ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో పాటు భారీ పరిశ్రమలను ఆకర్షించి ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు కడప యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని జిల్లా యంత్రాంగం భావిస్తోంది.
