
పెండింగ్ కేసులను పరిష్కరించండి: హైకోర్టు న్యాయమూర్తి పుల్లా కార్తీక్
న్యాయస్థానాల్లో ఏళ్లతరబడి పెండింగ్లో ఉన్న కేసులను యుద్ధప్రతిపాదికన పరిష్కరించాలని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తీక్ జుడీషియల్ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా పరిపాలనా న్యాయమూర్తి హోదాలో ఆయన శనివారం జిల్లా కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి సహా ఇతర న్యాయమూర్తులు ఆయనకు స్వాగతం పలికారు.
తర్వాత నిర్వహించిన న్యాయాధికారుల సమావేశంలో కార్తీక్ పెండింగ్లో ఉన్న కేసులు, కేసుల పరిష్కార తీరు గురించి సమీక్షించారు. కోర్టులకు న్యాయం కోసం వచ్చే ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించాలని ఆయన స్పష్టం చేశారు. కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం పెరగాలంటే కేసుల విచారణ వేగంగా పూర్తవ్వాలని ఆయన పేర్కొన్నారు. న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది సమన్వయంతో పనిచేసి న్యాయ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని జస్టిస్ కార్తీక్ ఆదేశించారు. అనంతరం కోర్టు పనితీరు, కేసుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు.
