

పుష్కరాల నాటికి భద్రాద్రి పునరుద్ధరణ పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి
వచ్చే గోదావరి పుష్కరాల నాటికి భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన పునరుద్ధరణ పనులను వంద శాతం పూర్తి చేసి, పుష్కరాల ప్రారంభానికి 15 రోజుల ముందే క్షేత్రాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేయాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం భద్రాచలంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి, సబ్ కలెక్టర్ కార్యాలయంలో దేవాదాయ, ఇంజినీరింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భద్రాద్రి పునరుద్ధరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.351 కోట్లు మంజూరు చేయగా, ఆలయ విస్తరణకు అవసరమైన భూసేకరణ కోసం ఇప్పటికే రూ.75 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు.
ఆలయ ఆధ్యాత్మిక, చారిత్రక విశిష్టతకు భంగం కలగకుండా నిపుణులైన శిల్పులతో, అత్యున్నత నాణ్యతా ప్రమాణాల మేరకు పనులు చేపట్టాలని మంత్రి సూచించారు. పురాతన గోపురాలు, కట్టడాల సహజత్వం దెబ్బతినకుండా ఆగమశాస్త్రాలకు అనుగుణంగా నిర్మాణాలు కొనసాగించాలని ఆదేశించారు. పనుల్లో వేగం పెంచేందుకు అవసరమైన చోట ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా 25 శాతం మంది కార్మికులను నియమించాలని, నిపుణులు, బాధ్యతాయుత అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి పనులను నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు. ఒకవైపు పనులు పూర్తయిన తర్వాతే మరోవైపు పనులు ప్రారంభించాలని, అధిక పనులు ఉన్న ఉత్తర భాగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. డ్రాయింగ్‌లు, సాంకేతిక అనుమతుల్లో జాప్యం లేకుండా శాఖల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు.
ఆలయ పనుల పర్యవేక్షణ కోసం ఇంజినీరింగ్ శాఖ నుంచి ప్రత్యేక అధికారిని వెంటనే నియమించాలని దేవాదాయ కమిషనర్‌ను టెలిఫోన్ ద్వారా ఆదేశించిన మంత్రి, కమిషనర్ ప్రతి పది రోజులకోసారి క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించాలని చెప్పారు. పనుల సమయంలో భక్తులకు దర్శనం, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత వంటి అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. పుష్కరాల దృష్ట్యా గోదావరి తీరంలో కొత్త స్నాన ఘట్టాలు, యాత్రికుల వసతుల విస్తరణ కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు.
భూ రీ-సర్వే గడువులోగా పూర్తి చేయాలి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపడుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియను పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఆదివారం సారపాకలోని ఐటీసీ గెస్ట్ హౌస్‌లో భూముల రీ-సర్వే పురోగతి, అటవీ-రెవెన్యూ భూ వివాదాలు, పోడు భూముల సమస్యలు, పాల్వంచ శ్రీనివాసగుట్ట అభివృద్ధిపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో రీ-సర్వే పనులు మరింత వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం 14 గ్రామాల్లో సర్వే కొనసాగుతుండగా, ఐదు గ్రామాల్లో ఇప్పటికే పూర్తి అయినట్లు అధికారులు వివరించారు. మిగిలిన గ్రామాల్లో కూడా నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో సర్వేయర్లు, రోవర్ పరికరాల కొరత లేకుండా అవసరమైన వనరులను సమకూర్చాలని ఆదేశించారు.
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అటవీ-రెవెన్యూ భూ సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించేందుకు రెవెన్యూ, అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రతి నెలా సమీక్ష సమావేశాలు నిర్వహించి పనుల పురోగతిని పర్యవేక్షించాలని చెప్పారు. కొత్తగా పోడు సాగు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు, ఇప్పటికే పోడు సాగు చేస్తున్న వారి సమస్యలను ప్రభుత్వ విధానాల మేరకు మానవీయ కోణంలో పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. పాల్వంచలోని శ్రీనివాసగుట్టను ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఆదేశించారు. గుట్టపై ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు సులభంగా చేరుకునేలా రహదారి నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
అనంతరం ఆలయ ఈవో దామోదరరావు, వేద పండితులు మంత్రికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీఓ రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
