Let's talk: editor@tmv.in
పులుల సంరక్షణ అందరి బాధ్యత: మంత్రి కొండా సురేఖ పిలుపు

పులుల సంరక్షణ అందరి బాధ్యత: మంత్రి కొండా సురేఖ పిలుపు

Gaddamidi Naveen
30 జులై, 2026

పులుల సంరక్షణ పట్ల సమాజంలోని అన్ని వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ఈ భూమి కేవలం మనుషులకే కాకుండా సమస్త జీవరాశుల ఉమ్మడి నివాసమని స్పష్టం చేశారు. బుధవారం ‘అంతర్జాతీయ పులుల దినోత్సవం’ సంద‌ర్బంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా దూలపల్లిలోని తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫొటో ఎగ్జిబిషన్, లఘు చిత్రాన్ని తిలకించి ప్రసంగించారు.

అనంతరం జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ, 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో ప్రారంభమైన ప్రపంచ పులుల దినోత్సవం పులుల సంరక్షణపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచేందుకు ముఖ్య వేదికగా మారిందన్నారు. పులి అడవుల ఆరోగ్యానికి ప్రతీక అని, పులులను కాపాడడం అంటే అడవులు, జీవవైవిధ్యం, పర్యావరణం, భావితరాల భవిష్యత్తును పరిరక్షించడమేనని పేర్కొన్నారు. వేట, అడవుల నరికివేత, అక్రమ రవాణా కారణంగా పులుల సంఖ్య ఒక దశలో తగ్గిపోయిందని, అయితే 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టం, 1973లో ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ టైగర్’తో దేశంలో పులుల సంరక్షణకు బలమైన పునాది పడిందని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచంలోని పులుల్లో సుమారు 75 శాతం భారతదేశంలోనే ఉండగా, దేశవ్యాప్తంగా 58 టైగర్ రిజర్వులు పనిచేస్తున్నాయని వివరించారు.

తెలంగాణలో అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వులు దేశంలోనే ప్రముఖ అభయారణ్యాలుగా గుర్తింపు పొందాయని మంత్రి తెలిపారు. అమ్రాబాద్‌లో నీటి వనరుల అభివృద్ధి, ఆవాసాల మెరుగుదలతో పులుల సంఖ్య పెరిగిందని, కవ్వాల్‌లో టైగర్ రీఇంట్రడక్షన్ కార్యక్రమాన్ని అమలు చేస్తూ మహారాష్ట్రలోని తడోబా టైగర్ రిజర్వుతో అనుసంధానం కల్పించినట్లు వెల్లడించారు. తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ రాష్ట్రాల ఫారెస్ట్ అధికారులను ఉద్దేశించి నిబద్ధతతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం అటవీ సంరక్షణలో విశేష కృషి చేసిన సిబ్బందికి, చిత్రలేఖన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.

ట్యాగ్‌లు
InternationalTigerDayTigerConservationSaveTigersProjectTigerWildlifeConservationProtectWildlifeSaveWildlifeNatureConservationBiodiversityForestConservationGreenTelanganaTelanganaForest
పులుల సంరక్షణ అందరి బాధ్యత: మంత్రి కొండా సురేఖ పిలుపు - Tholi Paluku