
పురుషోత్తపట్నం పంపులతో నీళ్లు ఎత్తి.. పోలవరం క్రెడిట్ ఎందుకు?: వైఎస్ జగన్
పోలవరం ప్రాజెక్టు విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రచారంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటికే ఉన్న పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పంపుల ద్వారా గోదావరి జలాలను ఎత్తిపోసి, ఉన్న పోలవరం ఎడమ కాలువలోకి విడుదల చేసి వాటిని పోలవరం జలాలుగా ప్రచారం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. నీళ్లు పురుషోత్తపట్నానివి… కాలువ వైఎస్సార్ హయాంలో నిర్మించినది.. క్రెడిట్ కోసం ఆరాటం మాత్రం మీదా? ఇదేం మ్యాజిక్? అని ఆయన ప్రశ్నించారు.
పురుషోత్తపట్నం నుంచి పంపుల ద్వారా ఎత్తిపోస్తున్న నీరు పోలవరం రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా వస్తున్న నీరు కాదని జగన్ పేర్కొన్నారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు, అక్కడి పంపులు ఇప్పటికే ఉన్నవేనని, అలాగే పోలవరం ఎడమ కాలువ కూడా గతంలోనే నిర్మితమైందని తెలిపారు. అలాంటప్పుడు ఇప్పుడు నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా కొత్తగా పోలవరం నీళ్లు తీసుకొచ్చినట్లు ప్రచారం చేయడం ఎందుకని ప్రశ్నించారు. నీళ్లు పురుషోత్తపట్నం నుంచి వస్తుండగా, కాలువ నిర్మాణంలోనూ గత ప్రభుత్వాల పాత్ర ఉందని పేర్కొంటూ.. క్రెడిట్ కోసం ప్రభుత్వం ఆరాటపడుతోందని విమర్శించారు.
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం వరుసగా నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకేనని జగన్ ఆరోపించారు. ఇటీవల వెలిగొండ ప్రాజెక్టు, తాజాగా పోలవరం ఎడమ కాలువ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టుల విషయంలోనూ ఇదే తరహా ప్రచారం కొనసాగే అవకాశం ఉందని అన్నారు. తాము ప్రారంభించని, పూర్తి చేయని ప్రాజెక్టులకు కూడా తమ ఘనతగా పేరు చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు.
పురుషోత్తపట్నం పంపుల ద్వారా సుమారు 3,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతోందని జగన్ గుర్తుచేశారు. అయితే ఆ ప్రాజెక్టు, పంపులు కొత్తవి కాదని పేర్కొన్నారు. పోలవరం ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన పనుల్లో 79 శాతం పనులు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ఇప్పటికే పూర్తయిన పనులపై నిలబడి మొత్తం ప్రాజెక్టును తామే పూర్తి చేసినట్లు చెప్పుకోవడం సరికాదని విమర్శించారు.
2014-19 నాటి తప్పులు – పోలవరానికి శాపం
2014–19 మధ్య పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేసిన తప్పిదాల వల్ల ప్రాజెక్టు తీవ్రంగా దెబ్బతిన్నదని జగన్ ఆరోపించారు. స్పిల్‌వే, కాఫర్ డ్యాం పనులను అసంపూర్తిగా ఉంచి, నదీ ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో మళ్లించకుండానే డయాఫ్రం వాల్ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. అనంతరం వచ్చిన వరదల సమయంలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల కారణంగా నీరు డయాఫ్రం వాల్ ప్రాంతానికి చేరి నష్టం వాటిల్లిందని ఆరోపించారు.
తమ ఐదేళ్ల పాలనలో ఈ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, స్పిల్‌వే, కాఫర్ డ్యాం పనులను పూర్తి చేసి, ఆ తర్వాత మెయిన్ డ్యాం నిర్మాణంలోని సంక్లిష్ట పనులను ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్లామని జగన్ తెలిపారు. అయితే ప్రస్తుతం కూడా ప్రభుత్వం ప్రాజెక్టును సరైన దిశలో ముందుకు తీసుకెళ్లడం లేదని విమర్శించారు.
పోలవరం ఎత్తుపై స్పష్టత ఏది?
పోలవరం ప్రాజెక్టు ఎత్తు, నీటి నిల్వ సామర్థ్యంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. పోలవరం పూర్తి రిజర్వాయర్ స్థాయి 45.72 మీటర్లు కాగా, నీటి నిల్వను 41.15 మీటర్లకే ఎందుకు పరిమితం చేస్తున్నారు? కేంద్రం 41.15 మీటర్ల వరకే నిధులిస్తామని చెప్తుంటే, పూర్తి స్థాయి ప్రాజెక్టు ఎలా సాధ్యమవుతుంది? నిర్వాసితులకు పరిహారం ప్యాకేజీ ఎప్పుడు చెల్లిస్తారు? డ్రామాలు మాని, ప్రాజెక్టును 45.72 మీటర్ల నిర్దేశిత ఎత్తులోనే పూర్తిచేయాలి. అప్పుడే గ్రావిటీ ద్వారా కుడి, ఎడమ కాలువలకు నీళ్లు సమృద్ధిగా అందించవచ్చు. అప్పుడు పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోలవరం నుంచి రెండు కాలువలకు సమృద్ధిగా నీటిని అందించవచ్చని జగన్ పేర్కొన్నారు.
'ఉత్తరాంధ్ర సుజల స్రవంతి'ని ఎందుకు విస్మరించారు?
ఉత్తరాంధ్రకు మేలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పరిస్థితిపై జగన్ ప్రశ్నలు సంధించారు. ఈ పథకానికి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2009లో రూ.7,214.10 కోట్ల పరిపాలనా అనుమతులు ఇచ్చారని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ధరలు, భూసేకరణ, నిర్మాణ వ్యయాలను పరిగణనలోకి తీసుకుని 2022లో అంచనాలను రూ.17,050.20 కోట్లకు సవరించి పరిపాలనా అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనులను టెండర్లు, ఒప్పందాల దశకు తీసుకెళ్లడంతో పాటు భూసేకరణ కోసం ప్రత్యేక యూనిట్లను ఏర్పాటు చేశామని వివరించారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరిట ప్రచార ఆర్భాటాలు చేయడం మాని, బాధ్యతాయుతంగా పనులు పూర్తి చేయాలని వైఎస్ జగన్ హితవు పలికారు.
