Let's talk: editor@tmv.in
పీజీ వైద్యులకు 24 గంటలకు మించి డ్యూటీ వద్దు: డీఎంఈ డాక్టర్‌ విష్ణువర్ధన్‌

పీజీ వైద్యులకు 24 గంటలకు మించి డ్యూటీ వద్దు: డీఎంఈ డాక్టర్‌ విష్ణువర్ధన్‌

Pinjari Chand
29 ఆగస్టు, 2026

ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల విధుల నిర్వహణ, డ్యూటీ రోస్టర్లు, సెలవుల విషయంలో ఇప్పటికే అమలులో ఉన్న నిబంధనలను కచ్చితంగా పాటించాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డాక్టర్‌ విష్ణువర్ధన్‌ ఆదేశించారు. పీజీ వైద్య విద్యార్థులతో వరుసగా 24 గంటలకు మించి డ్యూటీ చేయించకూడదని, వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించరాదని స్పష్టం చేశారు. ప్రతి పీజీ విద్యార్థికి వారానికి ఒక పూర్తి రోజు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశించారు. పీజీ వైద్య విద్యార్థుల పని గంటలు, డ్యూటీ రోస్టర్లు, సెలవులు, ఆరోగ్యం, సంక్షేమానికి సంబంధించి జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) మార్గదర్శకాలు, టాస్క్‌ఫోర్స్‌ సిఫార్సులను అమలు చేయాలని సూచించారు.

నైట్‌ డ్యూటీ తర్వాత తప్పనిసరిగా సెలవు

రాత్రి డ్యూటీ చేసిన పీజీ వైద్య విద్యార్థికి మరుసటి రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని డీఎంఈ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని డ్యూటీ రోస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. అవసరాన్ని బట్టి 24 గంటలు లేదా 10 గంటల షిఫ్టుల్లో డ్యూటీ రోస్టర్లు రూపొందించుకోవచ్చన్నారు. సాధారణ పని దినాల్లో కనీసం 30 నిమిషాల లంచ్‌ బ్రేక్‌, నైట్‌ డ్యూటీలో కనీసం 30 నిమిషాల డిన్నర్‌ బ్రేక్‌ ఇవ్వాలని, ఈ విరామ సమయాన్ని డ్యూటీ గంటల్లో కలపకూడదని పేర్కొన్నారు.

పీజీలకు 7–8 గంటల నిద్ర

డ్యూటీ రోస్టర్లు రూపొందించేటప్పుడు ప్రతి పీజీ వైద్య విద్యార్థికి రోజుకు 7–8 గంటల నిద్రకు అవకాశం ఉండేలా చూడాలని సూచించారు. విద్యార్థులకు కౌన్సెలింగ్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రెస్‌ మేనేజ్‌మెంట్‌ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి పీజీ విద్యార్థికి ఏడాదికి 20 రోజుల పెయిడ్‌ క్యాజువల్‌ లీవులు, ఐదు రోజుల అకడమిక్‌ లీవులు, 52 వారాంతపు సెలవులు ఉంటాయని స్పష్టం చేశారు. వారాంతపు సెలవులను ఇతర సెలవులతో సర్దుబాటు చేయరాదన్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ప్రతి విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ లేదా అంతకంటే పైస్థాయి అధికారిని పీజీ రిజిస్ట్రార్‌గా నియమించాలని డీఎంఈ ఆదేశించారు. హెచ్‌ఓడీ, పీజీ రిజిస్ట్రార్‌, ఫ్యాకల్టీ, సీనియర్‌ రెసిడెంట్లు, జూనియర్‌ రెసిడెంట్ల సమన్వయంతో డ్యూటీ రోస్టర్లు రూపొందించాలని సూచించారు. ప్రతి కళాశాలలో నోడల్‌ అధికారిని నియమించి, నెలవారీ కంప్లయన్స్‌ రిపోర్టును తదుపరి నెల 10వ తేదీలోపు డీఎంఈ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. నెలవారీ సమీక్ష సమావేశాలు నిర్వహించి పీజీ వైద్య విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. సమీక్ష సమావేశాలు నిర్వహించకపోయినా, కంప్లయన్స్‌ రిపోర్టులు సమర్పించకపోయినా సంబంధిత ప్రిన్సిపాల్‌, సూపరింటెండెంట్‌, హెచ్‌ఓడీలపై తగిన చర్యలు తీసుకుంటామని డాక్టర్‌ విష్ణువర్ధన్‌ హెచ్చరించారు.

జూనియర్‌ డాక్టర్లకు మంచినీటి సౌకర్యం

జూనియర్‌ డాక్టర్లు విధులు నిర్వహించే ప్రాంతాల్లో నెలలోగా మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. వాష్‌రూమ్‌లలోనూ నిరంతర నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులను సీఎస్‌ఆర్‌, హెచ్‌డీఎస్‌, సీడీఎస్‌ నిధుల నుంచి సర్దుబాటు చేసుకోవచ్చని తెలిపారు. నిర్దేశించిన సమయంలోగా సౌకర్యాలు కల్పించకపోతే చర్యలు తీసుకుంటామని వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్‌ ఆదేశించినట్లు డీఎంఈ తెలిపారు. జూనియర్‌ డాక్టర్ల అసోసియేషన్‌ విజ్ఞప్తులను పరిశీలించిన అనంతరం ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.

యర్రగొండపాలెం ఘటనపై విచారణ

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో అనధికారికంగా నిర్వహించినట్లు ఆరోపణలు ఉన్న అబార్షన్‌ వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటనపై విచారణ జరుపుతామని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ వెల్లడించింది. వైద్యుడు ఫోన్‌లో సలహాలు ఇస్తుండగా సిబ్బందితో అబార్షన్‌ ప్రక్రియ నిర్వహించినట్లు వచ్చిన వార్తలపై కౌన్సిల్‌ స్పందించింది. కౌన్సిల్‌లోని యాంటీ క్వాకరీ కమిటీ ద్వారా ఘటనకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించి, కౌన్సిల్‌కు ఉన్న అధికారాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ గార్లపాటి నంద కిశోర్‌ తెలిపారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని పేర్కొంటూ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.

పీజీ వైద్యులకు 24 గంటలకు మించి డ్యూటీ వద్దు: డీఎంఈ డాక్టర్‌ విష్ణువర్ధన్‌ - Tholi Paluku