
పీఎంఏవై కింద 11.56 లక్షల ఇళ్ల ఇవ్వండి.. కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో భేటీ అయ్యారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పిఎమ్‌ఎవై - గ్రామీణ) 2.0 కింద తెలంగాణ రాష్ట్రానికి 11.56 లక్షల పై ఇళ్లను కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణం తీవ్రంగా నిర్లక్ష్యానికి గురైందని లక్షలాది మంది పేదలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
గత ప్రభుత్వం పిఎమ్‌ఎవై - గ్రామీణ పథకాన్ని సరిగ్గా వినియోగించుకోకపోవడం వల్లే గడిచిన పదేళ్లలో పేదలకు సొంత ఇళ్లు దక్కలేదని సీఎం తెలిపారు. కేంద్రం రూపొందించిన ‘ఆవాస్ ప్లస్’ యాప్ ద్వారా నిర్వహించిన సర్వేలోనే 11,56,915 మంది అర్హులను గుర్తించామని వివరించారు.
తీవ్ర వర్షాభావం, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, కూలీలకు జీవనోపాధి పెంచేందుకు 'వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్' (వీబీ జీ రామ్ జీ) చట్టంలో అదనపు పనులను చేర్చాలని ప్రతిపాదించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్) పథకంతో అనుసంధానించాలని, దీనివల్ల సొంతిల్లు నిర్మించుకునే లబ్ధిదారులకు 90 రోజుల పాటు ఉపాధి లభిస్తుందని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఉపయోగపడేలా ఉపాధి హామీ పథకం కింద మరో 10 కొత్త పని విభాగాలను చేర్చాలని కోరారు. కూరగాయల పందిళ్లు, పశుగ్రాసం పెంపకం, మల్బరీ తోటలు, పట్టుపురుగుల పెంపకం షెడ్ల నిర్మాణంతో పాటు ప్రకృతి విపత్తుల వల్ల దెబ్బతిన్న పొలాల పునరుద్ధరణ, అలాగే కొండ ప్రాంతాల్లో భూసార అభివృద్ధి, నీటి నిల్వ పనులను రైతులు సొంతంగా చేసుకునేందుకు అనుమతించాలని ప్రతిపాదించారు.
అక్షయపాత్ర కేంద్రీకృత వంటశాలలకు ఆర్గానిక్ పంటల సరఫరా
ఇదిలా ఉండగా, ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అల్పాహార పథకంపై కూడా ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఐఎమ్‌డీలో హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్, దివీస్ ల్యాబొరేటరీస్, అరబిందో ఫార్మా ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉదయం అల్పాహార పథకం నిర్వహణ కోసం దివీస్ ల్యాబొరేటరీస్ రూ. 12.18 కోట్లు, అరబిందో ఫార్మా రూ. 10 కోట్ల సీఎస్‌ఆర్ నిధులను సీఎం సమక్షంలో హరేకృష్ణ ఫౌండేషన్‌కు అందించాయి.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కేంద్రీకృత వంటశాలలు ఉన్న ప్రాంతాల్లోని స్థానిక రైతులకు మద్దతుగా నిలిచేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పాఠశాల పిల్లల అల్పాహారం కోసం అవసరమైన కూరగాయలు, బియ్యం, ఇతర నిత్యావసరాలను నేరుగా స్థానిక రైతుల నుంచి సేకరించేలా వారిని సేంద్రీయ (ఆర్గానిక్) పంటల సాగు వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అలాగే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి పంట మార్పిడిని, అధిక లాభాలను ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో ఎంపీలు మల్లు రవి, రామసహాయం రఘురాంరెడ్డి, సురేష్ షెట్కార్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించారని, తెలంగాణలో క్షేత్రస్థాయి పరిశీలనకు రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
