
పీఎం-అజయ్ కింద తెలంగాణలో 435 ఆదర్శ గ్రామాల ఎంపిక
షెడ్యూల్డ్ కులాల సామాజిక, ఆర్థిక అభివృద్ధిని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన (పీఎం-అజయ్)లోని ఆదర్శ గ్రామ్ కాంపోనెంట్ కింద దేశవ్యాప్తంగా మొత్తం 47,328 గ్రామాలు ఎంపిక కాగా, అందులో తెలంగాణ రాష్ట్రం నుంచి 435 గ్రామాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
రాజ్యసభలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్‌దాస్ అథావలే రాతపూర్వక సమాధానమిచ్చారు. ఈ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను సమన్వయం చేస్తూ గ్రామాల్లో ఉన్న అభివృద్ధి లోటుపాట్లను గుర్తించి, వాటిని పరిష్కరించడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
పీఎం-అజయ్ ఆదర్శ గ్రామ్ కాంపోనెంట్‌లో విద్య సహా మొత్తం 10 రంగాలకు చెందిన 50 సామాజిక, ఆర్థిక సూచికలను పూర్తిస్థాయిలో అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం ముందుగా అవసరాల అంచనా సర్వే నిర్వహించి, ఆయా గ్రామాల్లోని ప్రస్తుత పరిస్థితిని నమోదు చేస్తారని వివరించారు. అనంతరం గుర్తించిన లోటుపాట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల సమన్వయం ద్వారా లేదా పీఎం-అజయ్ కింద చేపట్టే ప్రత్యేక చర్యల ద్వారా భర్తీ చేస్తారని చెప్పారు. రాష్ట్రాలు సాధించిన పురోగతిని పీఎంఏజీవై పోర్టల్‌లో నిరంతరం నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఈ పథకం కింద ఇప్పటివరకు 3,28,131 అభివృద్ధి పనులు, 1,10,51,213 మంది లబ్ధిదారులను గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. వీటిలో 46,642 అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, వాటి ద్వారా ఇప్పటికే 47,59,399 మంది లబ్ధి పొందినట్లు వివరించింది.
తెలంగాణలో విద్యా రంగంలో మొత్తం 3,529 మంది లబ్ధిదారులను గుర్తించగా, వారిలో 472 మందికి ఇప్పటికే పథకం ప్రయోజనాలు అందినట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే ఆదర్శ గ్రామాల గుర్తింపులో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమర్పించిన స్వీయ ధ్రువీకరణలను తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశాలు జారీ చేసినట్లు, మూడో పక్ష ఆడిట్‌కు సంబంధించిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు తెలియజేసింది.
