Let's talk: editor@tmv.in
పిల్లల ఆరోగ్యానికి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

పిల్లల ఆరోగ్యానికి ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరి: మంత్రి దామోదర్ రాజనర్సింహ

Gaddamidi Naveen
14 జులై, 2026

జాతీయ నులిపురుగుల(నట్టలు) నివారణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రారంభించారు. పాఠశాల విద్యార్థులకు స్వయంగా మాత్రలను పంపిణీ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ.. 1 నుంచి 19 సంవత్సరాల వయస్సున్న పిల్లలందరికీ తల్లిదండ్రులు ఈ మాత్రను తప్పనిసరిగా వేయించాలని విజ్ఞప్తి చేశారు.

పిల్లల కడుపులో నులిపురుగులు ఉండడం వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, శారీరక ఎదుగుదల మందగించడం, బరువు తగ్గడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని మంత్రి వివరించారు. ఈ ఆరోగ్య సమస్యల కారణంగా పిల్లల్లో చదువుపై శ్రద్ధ, ఏకాగ్రత తగ్గే ప్రమాదం ఉందన్నారు. నులిపురుగులు నేరుగా బయటకు కనిపించకపోయినా పిల్లల అంతర్గత ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని, అందుకే ఈ నివారణ మాత్రలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ మాత్రల వల్ల నులిపురుగుల సమస్య తొలగి, తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి అంది రోగనిరోధక శక్తి పెరుగుతుందని, అలాగే నేర్చుకునే సామర్థ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్న ఈ బృహత్ కార్యక్రమానికి తల్లిదండ్రులు పూర్తి సహకారం అందించాలని మంత్రి కోరారు. కేవలం మాత్రలు వేయడంతోనే ఈ బాధ్యత ముగిసిపోదని, పిల్లల్లో వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, సురక్షితమైన తాగునీరు తాగడం, పండ్లు, కూరగాయలను కడిగి తినడం వంటి మంచి అలవాట్లపై పాఠశాలల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 1 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల 96,81,855 మంది చిన్నారులు, విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందించనున్నారు. జూలై 13న మాత్ర తీసుకోలేకపోయిన పిల్లలకు జూలై 20న మాప్-అప్ కార్యక్రమం ద్వారా తప్పనిసరిగా మందు అందించాలని ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పంపిణీ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఆరోగ్యశాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
AlbendazoleNationalDewormingDayDewormingDriveChildHealthHealthyChildrenTelanganaHealthDamodarRajanarsimhaPublicHealthSchoolHealthAnganwadi