Let's talk: editor@tmv.in
పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పట్టుకున్న సీఐపై వేటు.. విచారణకు ఎస్పీ ఆదేశం

పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పట్టుకున్న సీఐపై వేటు.. విచారణకు ఎస్పీ ఆదేశం

Gaddamidi Naveen
21 ఆగస్టు, 2026

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట నిరసన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించిన సీఐ రఘుపతి రెడ్డిపై జిల్లా ఎస్పీ శబరీశ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం విద్యార్థులు కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. ఈ సందర్భంగా వారిని అడ్డుకునే క్రమంలో సీఐ రఘుపతి రెడ్డి ఇద్దరు విద్యార్థుల గొంతు పట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటనపై విమర్శలు వ్యక్తమవడంతో ఎస్పీ శబరీశ్ స్పందించారు. సీఐని యాక్టివ్ డ్యూటీ నుంచి తాత్కాలికంగా తొలగించినట్లు వెల్లడించారు. ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టేందుకు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించినట్లు తెలిపారు. సమగ్ర విచారణ అనంతరం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.

విద్యార్థుల పట్ల పోలీసు అధికారి వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేశాయి. నిరసనలను నియంత్రించే క్రమంలో పోలీసులు సంయమనం పాటించాలని, ప్రజాస్వామ్యంలో విద్యార్థులకు ప్రశ్నించే హక్కు ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. వారి సమస్యలను వినాల్సిన బాధ్యత ప్రభుత్వంపై, అధికారులపై ఉంటుంద‌ని విద్యార్థులతో దురుసుగా వ్యవహరించకూడదని డిమాండ్ చేశాయి.

ఆగస్టు 19న తెలంగాణవ్యాప్తంగా పలు జిల్లాల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు జీఓ-97, ‘శక్తి’ స్కీమ్‌లో భాగంగా పాలిటెక్నిక్ కళాశాలలను ఐటీఐలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీతో విలీనం చేసే ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా మహబూబాబాద్ కలెక్టరేట్ ముట్టడికి విద్యార్థులు ప్రయత్నించారు. జీఓ-97తో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులను ఇతర నైపుణ్య విద్యా సంస్థలతో విలీనం చేస్తే విద్యార్థుల ఉన్నత విద్యావకాశాలు దెబ్బతింటాయని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈసెట్ ద్వారా లేటరల్ ఎంట్రీ అవకాశాలు తగ్గిపోతాయని, సాంకేతిక విద్య ప్రమాణాలు ప్రభావితమవుతాయని వారు పేర్కొంటున్నారు.

పాలిటెక్నిక్ విద్యార్థి గొంతు పట్టుకున్న సీఐపై వేటు.. విచారణకు ఎస్పీ ఆదేశం - Tholi Paluku