Let's talk: editor@tmv.in
పాతబస్తీలో వైభవంగా బోనాల ఉత్సవాలు.. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
పాతబస్తీలో వైభవంగా బోనాల ఉత్సవాలు.. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
పాతబస్తీలో వైభవంగా బోనాల ఉత్సవాలు.. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
పాతబస్తీలో వైభవంగా బోనాల ఉత్సవాలు.. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
పాతబస్తీలో వైభవంగా బోనాల ఉత్సవాలు.. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

పాతబస్తీలో వైభవంగా బోనాల ఉత్సవాలు.. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

Gaddamidi Naveen
10 ఆగస్టు, 2026

తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగ వేడుకలు హైదరాబాద్ పాతబస్తీలో ఆదివారం ఎంతో వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో భాగంగా చారిత్రాత్మక లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయం, సుల్తాన్ షాహీ, హరిబౌలి, మీర్ ఆలం మండి పరిసరాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మహిళలు సాంప్రదాయబద్ధంగా అలంకరించిన బోనాలను శిరస్సుపై ధరించి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ ఉత్సవాల్లో పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అంబర్‌పేట్ మహంకాళి ఆలయంలో కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అంబర్‌పేట్ మహంకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో బోనాల పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని, మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలను సమర్పించడం ఈ ఉత్సవ ప్రత్యేకత అని తెలిపారు. ప్రజలందరికీ శాంతి, సుభిక్షం సిద్ధించాలని, ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ లభించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. అలాగే అంబర్‌పేట మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి సీతక్క ప్రభుత్వ సలహాదారుతో కలిసి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

భాగ్యలక్ష్మి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రులు

హైదరాబాద్‌ చార్మినార్‌ వద్ద ఆషాఢ బోనాల సందర్భంగా శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ దర్శించుకున్నారు. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ మరింత అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించారు.

లాల్ దర్వాజా ఆలయంలో విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా

మరోవైపు ప్రముఖ సినీ నటుడు విజయ్‌ దేవరకొండ బోనాల వేడుకల్లో పాల్గొన్నారు. తన సోదరుడు, నటుడు ఆనంద్‌ దేవరకొండ, ప్రముఖ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాతో కలిసి పాతబస్తీలోని చారిత్రక శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. విజయ్‌ దేవరకొండ ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు, భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ పరిసరాలు అభిమానుల సందడితో కిక్కిరిశాయి.

ఈ సందర్భంగా విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారిని దర్శించుకోవడానికి తాను తొలిసారి ఇక్కడికి వచ్చానని చెప్పారు. దర్శకుడు సందీప్‌రెడ్డితో కలిసి ఆలయానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజల కోరికలు నెరవేరాలని, తన కోరికలు కూడా ఫలించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు వెల్లడించారు. పూజలు, దర్శనం ఎంతో సంతృప్తినిచ్చాయని పేర్కొన్నారు.

భక్తులతో కలిసి పూజలు చేసిన కేటీఆర్, చామల కిరణ్ కుమార్ రెడ్డి

బీఆర్‌ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌లతో కలిసి నాంపల్లి ఏడు గుళ్ల పోచమ్మ ఆలయం, లాల్ దర్వాజా, మీర్ ఆలం మహంకాళి ఆలయాలను సందర్శించి పూజలు చేశారు. అనంతరం ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ట్విట్టర్ ద్వారా ఆదివాసీల ఆత్మగౌరవం, అభివృద్ధికై గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తుచేశారు.

కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ కూడా లాల్‌దర్వాజా మహంకాళి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నప్పటికీ ప్రతి ఏడాది మాదిరిగానే బోనాల సందర్భంగా హైదరాబాద్‌కు వచ్చానని తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమంతో పాటు రైతులకు మంచి జరగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు.

హైదరాబాద్‌ పాతబస్తీలో రెండు రోజుల పాటు జరిగే బోనాల ఉత్సవాలు ఆగస్టు 9, 10 తేదీల్లో కొనసాగనున్నాయి. లాల్‌దర్వాజా, సుల్తాన్‌షాహీ, హరిబౌలి ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలు వేడుకలకు ప్రధాన కేంద్రాలుగా నిలిచాయి. మహిళలు సంప్రదాయబద్ధంగా అలంకరించిన బోనం కుండలను మోసుకెళ్లడం, జానపద నృత్యాలు, భక్తుల ఊరేగింపులతో పాతబస్తీ ప్రాంతం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

పాతబస్తీలో వైభవంగా బోనాల ఉత్సవాలు.. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు - Tholi Paluku