
పాతబస్తీలో రోబోటిక్ టెక్నాలజీతో డీ-సిల్టింగ్ పనులు
పాతబస్తీ ప్రాంతంలో మురుగునీటి శుద్ధి, డీ-సిల్టింగ్ పనులను ఆధునిక రోబోటిక్ టెక్నాలజీతో నిర్వహించే దిశగా జలమండలి ప్రయోగాత్మకంగా కొత్త విధానాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, జేఎండీ మయాంక్ మిట్టల్ కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
శనివారం ఓ అండ్ ఎం డివిజన్-3 పరిధిలోని విజయనగర్ కాలనీ సెక్షన్లో మల్లేపల్లి ఎక్స్ రోడ్ నుంచి వీఎన్సీ ఎక్స్ రోడ్ వరకు ఉన్న సీవర్ లైన్లో చోకేజ్ సమస్య తలెత్తింది. మురుగునీటి ప్రవాహం అంతరాయం కలగకుండా ఉండేందుకు అధికారులు డీ-సిల్టింగ్ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా సీవరేజ్ లైన్లలో అడ్డంకులను వేగంగా గుర్తించి తొలగించేందుకు రోబోటిక్ యంత్రాన్ని వినియోగించే విధానాన్ని అధికారులు పరిశీలించారు.
ఏజెన్సీ నిర్వాహకులు ఈ టెక్నాలజీ ప్రత్యేకతలను వివరించారు. నిలువు మాన్హోల్స్తో పాటు అడ్డంగా ఉన్న పైప్లైన్లను శుభ్రపరిచే సామర్థ్యం గల సెల్ఫ్-డిటెక్టివ్ రోబోటిక్ వ్యవస్థలు ఇందులో భాగం. అదనంగా, మాన్హోల్స్లో అడ్డంకులు ఏర్పడే ముందే అంచనా వేసి నివారించేందుకు ఏఐ ఆధారిత ప్రిడిక్షన్, ప్రివెంటివ్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది. నగరవ్యాప్తంగా పారిశుధ్య కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు, ట్రాక్ చేయడానికి, సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించేందుకు రియల్-టైమ్ డాష్బోర్డ్స్ను సాంప్రదాయ వ్యవస్థలతో అనుసంధానం చేయడం ఈ సాంకేతికతలోని మరో ముఖ్యాంశం.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రీజియన్ ఈడీ సామ్రాట్ అశోక్, ఆపరేషన్ డైరెక్టర్ వినోద్ భర్గవ, తదితర అధికారులు పాల్గొన్నారు. నగర పారిశుధ్య నిర్వహణలో సాంకేతికత వినియోగం ద్వారా మరింత సమర్థత సాధించాలనే లక్ష్యంతో ఈ ప్రయోగం చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
