
పాక్-అఫ్గాన్ శాంతి ఒప్పందం
పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ మధ్య సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది. ఇరుదేశాల మధ్య ఆదివారం దోహా వేదికగా జరిగిన శాంతి చర్చలు విజయవంతమయ్యాయి. ఖతార్, టర్కీ దేశాల మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ చర్చల్లో ఇరుపక్షాలు తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి.
ఆఫ్ఘనిస్తాన్ ప్రతినిధి ఈ ఒప్పందం వివరాలను 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ద్వారా వెల్లడిస్తూ, చర్చలను సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఖతార్, టర్కీలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఒప్పంద నిబంధనలు
ఏ దేశం కూడా మరొక దేశంపై శత్రు చర్యలు చేపట్టకూడదు. పాకిస్తాన్ ప్రభుత్వంపై దాడులు చేసే ఏ గ్రూపులకైనా మద్దతు ఇవ్వరాదని ఇరు దేశాలు అంగీకరించాయి. ఇరుపక్షాలు ఒకరి భద్రతా దళాలను, పౌరులను, ముఖ్యమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోకుండా ఉండాలని నిర్ణయించాయి. శాంతి, పరస్పర గౌరవం, బలమైన పొరుగు సంబంధాలను కొనసాగించడానికి తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నారు.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని సమర్థంగా అమలు చేయడానికి మధ్యవర్తి దేశాల పర్యవేక్షణలో ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీర్ఘకాలిక శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడానికి ఇరుపక్షాలు తదుపరి సమావేశాలను నిర్వహించడానికి కూడా అంగీకరించాయి.
చర్చలకు ముందు ఉద్రిక్తతలు
దోహా చర్చలకు ముందు శుక్రవారం రోజున తీవ్రమైన కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని ఆగ్నేయ పక్తికా ప్రావిన్స్‌పై వైమానిక దాడులు చేపట్టింది. ఈ దాడుల్లో ముగ్గురు ఆఫ్ఘన్ క్రికెటర్లతో సహా 17 మంది పౌరులు మరణించారు. టోలో న్యూస్ ప్రకారం, ఈ వైమానిక దాడులు అర్గున్, బర్మల్ జిల్లాల్లోని నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. కాల్పుల విరమణకు ముందు పాకిస్తాన్ ఆఫ్ఘన్ గగనతలాన్ని 710 సార్లు ఉల్లంఘించినట్లు నివేదించబడింది.
భారత్‌పై పాక్ సైన్యాధ్యక్షుడి బెదిరింపులు
మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, భారత్‌ను అణ్వాయుధాల పేరుతో బెదిరించే ప్రయత్నం చేశారు. "ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి ఏజెంట్‌గా పనిచేస్తోంది. మా విస్తరిస్తున్న సైనిక సామర్థ్యాలు భారత భౌగోళిక భద్రతను దెబ్బ తీయగలవు" అని ఆయన పేర్కొన్నారు.