
పాకిస్థాన్‌కు వెళ్లొద్దు.. తమ పౌరులకు అమెరికా అలర్ట్!
పాకిస్థాన్‌లో భద్రతా పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ తమ పౌరులకు మరోసారి కఠిన హెచ్చరికలు జారీ చేసింది. పాక్‌లో ఉగ్రవాదం, సాయుధ పోరాటాలు, పెరుగుతున్న నేరాలు, కిడ్నాపుల దృష్ట్యా ఆ దేశానికి వెళ్లే ప్రయాణాలను పునరాలోచించుకోవాలని సూచించింది. తాజా సమీక్షలో పాకిస్థాన్‌ను ప్రమాదకరమైన 'లెవల్-3' విభాగంలోనే కొనసాగిస్తూ అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది.
కాన్సులేట్ సిబ్బందికి ఎగ్జిట్ ఆదేశాలు
లాహోర్, కరాచీల్లోని అమెరికా కాన్సులేట్‌లలో పనిచేస్తున్న అత్యవసరం కాని ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వెంటనే పాకిస్థాన్‌ను వీడి రావాలని అమెరికా ఆదేశించింది. భద్రతా పరమైన ముప్పు పొంచి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. సాధారణ పౌరులు కూడా స్థానిక పరిస్థితులను నిశితంగా గమనిస్తూ ఉండాలని, రద్దీగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించింది.
అత్యంత ప్రమాదకరమైన 'లెవల్-4' జోన్లు
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తున్ఖ్వా వంటి ప్రాంతాలతో పాటు భారత్-పాక్ సరిహద్దు వెంబడి ఉన్న ప్రదేశాలను అమెరికా అత్యంత ప్రమాదకరమైనవిగా (లెవెల్-4 జోన్లు) ప్రకటించింది. ఆయా చోట్ల ఉగ్రవాద దాడులు, కిడ్నాపులు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని, అక్కడికి వెళ్లడం ప్రాణాలకే ముప్పు అని హెచ్చరించింది. ముఖ్యంగా మార్కెట్లు, హోటళ్లు వంటి జనం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని భయంకర పరిస్థితులు ఉన్నాయని, కాబట్టి అమెరికా పౌరులు అటువైపు వెళ్లకపోవడమే మంచిదని స్పష్టం చేసింది.
ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారికి హెచ్చరిక
అమెరికా, పాకిస్థాన్ రెండు దేశాల పౌరసత్వం ఉన్న వారు మరింత అప్రమత్తంగా ఉండాలని అమెరికా సూచించింది. ఇలాంటి వారు స్థానికంగా నిర్బంధానికి గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాన నగరాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో అమెరికా కాన్సులర్ సాయం అందడం చాలా కష్టమని, పౌరులు తమ భద్రతను తామే చూసుకోవాలని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. స్థానిక వార్తా సంస్థల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలని హితవు పలికింది.
