Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
పాకిస్తాన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం

పాకిస్తాన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం

Shaik Mohammad Shaffee
20 అక్టోబర్, 2025

పాకిస్తాన్‌లో మరోసారి భూమి స్వల్పంగా కంపించింది. ఆదివారం రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. ఈ భూకంపం చాలా తక్కువ లోతులో, అంటే భూ ఉపరితలం నుండి కేవలం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. తక్కువ లోతులో సంభవించే భూకంపాల వల్ల భూ ఉపరితలంపై ప్రకంపనల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీనికి ఒక రోజు ముందు ఆంటే శనివారం కూడా పాకిస్తాన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది కూడా 10 కిలోమీటర్ల లోతులోనే కేంద్రీకృతమైంది.

తక్కువ లోతులో వచ్చే భూకంపాలు సాధారణంగా లోతుగా వచ్చే వాటి కంటే ఎక్కువ ప్రమాదకరం. ఎందుకంటే భూకంప తరంగాలు భూ ఉపరితలాన్ని చేరుకోవడానికి తక్కువ దూరం ప్రయాణించడం వలన, నేల కంపించే తీవ్రత బలంగా ఉంటుంది. దీనివల్ల భవనాలకు, నిర్మాణాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఎక్కువ. ప్రాణ నష్టం కూడా భారీగానే ఉంటుంది.

పాక్‌లో తరచూ భూకంపాలకు కారణాలు

పాకిస్తాన్‌లో తరచూ భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం ఆ దేశం ఉన్న భౌగోళిక స్థానమే. పాకిస్తాన్‌ భూమి ఇండియన్ ప్లేట్, యూరేశియన్ ప్లేట్ మధ్య సరిహద్దులో ఉంది. ఈ రెండు ప్లేట్లు పరస్పరం ఢీకొనడం వల్ల భూమి అడుగుభాగంలో అధిక పీడనం ఏర్పడి, అది విడుదల కావడం వలన భూకంపాలు వస్తుంటాయి.

బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, గిల్గిట్-బాల్టిస్తాన్ ప్రావిన్సులు యూరేషియన్ ప్లేట్ అంచున ఉన్నాయి. సింధ్, పంజాబ్ భారతీయ ప్లేట్ అంచున ఉన్నాయి. బలూచిస్తాన్ ప్రత్యేకంగా అరేబియన్, యూరేషియన్ టెక్టోనిక్ ప్లేట్ల మధ్య ఉన్న క్రియాశీలక సరిహద్దుకు దగ్గరగా ఉంది. దీనివల్ల అక్కడ తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి.

పాకిస్తాన్ చరిత్రలో అత్యంత తీవ్రమైన భూకంపం 1945 బలూచిస్తాన్ భూకంపం (తీవ్రత 8.1)గా నమోదైంది. ఈ భూకంపం అరేబియా సముద్రంలో సునామీకి దారితీసింది. తీర ప్రాంత గ్రామాలను ముంచెత్తింది. ఈ భూకంపం ధాటికి సుమారు 4 వేల మంది మరణించారు. ఇక 2005లో ముజఫరాబాద్ (పాక్‌ ఆక్రమిత కాశ్మీర్)లో సంభవించిన భూకంపం పాకిస్తాన్ చరిత్రలోనే అత్యంత ఘోరమైనది. 7.7 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి 87 వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.

పాకిస్తాన్‌లో 4.0 తీవ్రతతో భూకంపం - Tholi Paluku