Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య స్వదేశానికి చేరిన 500 మందికి పైగా ఏపీ వాసులు

పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య స్వదేశానికి చేరిన 500 మందికి పైగా ఏపీ వాసులు

Panthagani Anusha
9 మార్చి, 2026

పశ్చిమాసియాలో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ వాసులు సురక్షితంగా స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ సమన్వయంతో ఇప్పటివరకు 500 మందికి పైగా వ్యక్తులు రాష్ట్రానికి తిరిగి వచ్చినట్లు సంస్థ అధ్యక్షుడు రవి వెమూరు వెల్లడించారు.

తాత్కాలిక వీసాదారులే అధికం

తిరిగి వచ్చిన వారిలో అత్యధికులు గల్ఫ్ దేశాల్లో తాత్కాలిక వీసాలపై పర్యటిస్తున్న వారు ఇతర దేశాలకు వెళ్తూ మధ్యలో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ట్రాన్జిట్ ప్రయాణికులుగా చిక్కుకున్న వారేనని వెమూరు తెలిపారు. కాగా మా కార్యాలయాన్ని సంప్రదించిన సుమారు 400 మందికి మేము నేరుగా సహాయం అందించాం. మిగిలిన వారు స్వయంగా వాణిజ్య విమానాల ద్వారా భారత్‌కు చేరుకున్నారు అని ఆయన పేర్కొన్నారు. యూఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఒమాన్ వంటి దేశాల్లో చిక్కుకున్న మరికొందరికి నుంచి ప్రత్యేక విమానాలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా స్వస్థలాలకు చేరుకునేలా చర్యలు తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

అదేవిధంగా విమాన సర్వీసుల అంతరాయం ఉన్న చోట ప్రయాణికులను వినూత్న మార్గాల్లో తరలించినట్లు అధికారులు తెలిపారు. కొన్ని బృందాలను దుబాయ్ నుండి రోడ్డు మార్గంలో మస్కట్ విమానాశ్రయానికి చేర్చి అక్కడ నుండి భారత్‌కు పంపారు. మరికొందరిని ఫుజైరా నుండి ప్రైవేట్ విమాన సర్వీసుల ద్వారా నేరుగా తీసుకువచ్చారు. అయితే బహ్రెయిన్‌లో జరిగిన ఒక కాన్ఫరెన్స్‌కు హాజరైన సుమారు 50 మంది తెలుగు పాస్టర్లు ఇంకా అక్కడే చిక్కుకుపోయి ఉన్నారు. వారిని సౌదీ అరేబియాలోని దమ్మం లేదా రియాద్ మార్గాల ద్వారా స్వదేశానికి చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వెమూరు వివరించారు.

అత్యవసర ఉద్యోగులు అక్కడే

కాగా గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో పనిచేస్తున్న భారతీయులు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులను ఆయా దేశాలు 'అత్యవసర సిబ్బందిగా గుర్తించాయని అందువల్ల వారు తక్షణమే స్వదేశానికి వచ్చే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు బాధితులకు సహాయం అందించడంలో ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు నిరంతరం సమన్వయం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరి భద్రతపై నిశితంగా నిఘా ఉంచిందని రవి వెమూరు ధీమా వ్యక్తం చేశారు.

పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య స్వదేశానికి చేరిన 500 మందికి పైగా ఏపీ వాసులు - Tholi Paluku