Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Dantu Vijaya Lakshmi Prasanna
6 మార్చి, 2026

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం నుంచి రెండు రోజులపాటు పశ్చిమ బెంగాల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ సాంస్కృతిక, విద్యా, సామాజిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొననున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.

రాష్ట్రపతి ముర్ము మార్చి 6 శుక్రవారం డార్జిలింగ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘వందే మాతరం’ గీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరగిన డార్జిలింగ్ హిల్ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. భారత స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ‘వందే మాతరం’ గీతానికి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవం ద్వారా దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు డార్జిలింగ్ ప్రాంతంలోని సాంస్కృతిక సంప్రదాయాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కార్యక్రమాలను రూపొందించారు.

అనంతరం రాష్ట్రపతి, డార్జిలింగ్‌లోని లోక్ భవన్‌లో ఏర్పాటు చేసిన ‘రూట్ అండ్ రిథమ్స్’ అనే ప్రత్యేక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ప్రాంతీయ సంస్కృతి, కళలు, సంప్రదాయాలు, ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబించే అనేక కళాఖండాలు, ఫోటోలు సాంస్కృతిక అంశాలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక కళాకారులకు ప్రోత్సాహం లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.

తరువాత రాష్ట్రపతి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో నిర్వహించిన మహిళా నాయకత్వం, సాధికారతపై ప్లాటినమ్ జూబిలీ ఫ్లాగ్‌షిప్ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రారంభించారు. మహిళల సాధికారత, నాయకత్వ నైపుణ్యాల పెంపొందనకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం విద్యా రంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

మార్చి 7న రాష్ట్రపతి ముర్ము డార్జిలింగ్‌లో అంతర్జాతీయ సంతాల్ కౌన్సిల్ నిర్వహిస్తున్న 9వ అంతర్జాతీయ సంతాల్ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సదస్సులో సంతాల్ సమాజానికి చెందిన ప్రతినిధులు, పండితులు, సామాజిక కార్యకర్తలు పాల్గొని వారి సంస్కృతి, సంప్రదాయాలు, అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రపతి పాల్గొనడం ద్వారా ఈ సదస్సుకు మరింత ప్రాధాన్యం ఏర్పడనుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము - Tholi Paluku