Let's talk: editor@tmv.in
పండుగ వేళ ఆర్టీసీ ఛార్జీల పెంపు అన్యాయం: హరీశ్ రావు

పండుగ వేళ ఆర్టీసీ ఛార్జీల పెంపు అన్యాయం: హరీశ్ రావు

Gaddamidi Naveen
19 అక్టోబర్, 2026

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శలు చేశారు. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించి, రెగ్యులర్ బస్సులను యథావిధిగా నడపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.

పండుగల వేళ ప్రజలకు కానుకలు ఇవ్వాల్సింది పోయి, టికెట్ ధరలను రెట్టింపు చేసి ప్రయాణికులపై అదనపు భారం మోపుతున్నారని హరీశ్ రావు ఆరోపించారు. రెగ్యులర్ బస్సుల సంఖ్యను తగ్గించి, స్పెషల్ బస్సుల పేరుతో అధిక ఛార్జీలు వసూలు చేయడం సరికాదన్నారు. జేబీఎస్ నుంచి కరీంనగర్‌కు సాధారణంగా రూ.230గా ఉన్న టికెట్ ధరను రూ.400కు పెంచారని, మహబూబ్‌నగర్ నుంచి ఎంజీబీఎస్‌కు రూ.220గా ఉన్న ఛార్జీని రూ.290కిపైగా వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు.

రేవంత్ ప్రభుత్వ తీరుతో పేద, మధ్యతరగతి ప్రజలు పండుగలకు సొంతూళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని చెబుతూ, పురుషుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేయడం వల్ల కుటుంబాలపైనే అదనపు భారం పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో ఇప్పటికే ఐదుసార్లు ఆర్టీసీ టికెట్ ఛార్జీలు పెంచిందని హరీశ్ రావు ఆరోపించారు. పండుగల పేరుతో పెంచిన ఛార్జీలను తక్షణమే తగ్గించాలని, అదనపు బస్సులను ఏర్పాటు చేయడంతోపాటు సాధారణ సర్వీసులను కూడా యథావిధిగా నడిపించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.

పండుగ వేళ ఆర్టీసీ ఛార్జీల పెంపు అన్యాయం: హరీశ్ రావు - Tholi Paluku