
పండగ పూట ప్రజలకు నిరుత్సాహమే: బొత్స సత్యనారాయణ
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజల్లో సంక్రాంతి సందడి లేకుండా పోయిందని శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పండగ పూట ప్రజలకు నిరుత్సాహమే మిగిలిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
మద్యం గురించి గొప్పలు చెప్పే చంద్రబాబు.. పండగ ముందే బాటిల్‌పై రూ. 10 పెంచి సామాన్యులపై భారం వేశారని బొత్స విమర్శించారు. అంతటితో ఆగకుండా భూముల విలువలు పెంచుతూ రిజిస్ట్రేషన్ ఛార్జీలను భారీగా పెంచడం దుర్మార్గమన్నారు. "ప్రభుత్వ పెద్దల ఇళ్లు సుఖంగా ఉంటే చాలు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదన్నట్టుగా కూటమి తీరు ఉంది" అని దుయ్యబట్టారు.
ఇక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని బొత్స ఆరోపించారు. రాష్ట్రంలో నేటికీ యూరియా కొరత వేధిస్తోందని, రూ.270 ఖరీదు చేసే బస్తాను నల్లబజారులో రూ. 600కు కొనాల్సిన పరిస్థితి ఉందన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక, కొనే నాథుడు లేక రైతులు పండగ పూట కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
గత 18 నెలలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును అంధకారం చేస్తోందని విమర్శించారు. 8 త్రైమాసికాలకు సంబంధించి దాదాపు రూ. 5,600 కోట్లు బకాయి పెట్టారని దీనివల్ల ప్రైవేటు విద్యా సంస్థలు తమ సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీ సేవలు కూడా రాష్ట్రంలో పూర్తిగా అటకెక్కాయని ఆరోపించారు.
అక్కడ హత్యలు.. ఇక్కడ శంకుస్థాపనలు
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, వందలాది కుటుంబాలను గ్రామ బహిష్కరణ చేయడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త సాల్మన్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని, దీనికి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని నిలదీశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం శంకుస్థాపనలు చేస్తూ డప్పు కొట్టుకుంటోందని ఎద్దేవా చేశారు. కాకినాడలోని గ్రీన్‌కో ప్రాజెక్టు జగన్ హయాంలో వచ్చిందేనని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు విలువైన భూములను కట్టబెడితే చూస్తూ ఊరుకోబోమని, ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని ఆయన హెచ్చరించారు.
