Let's talk: editor@tmv.in

Bold! Concerned! Unfiltered! Responsible!

Sudhir Pidugu
Sudhir Pidugu
Founder & Editorial Director
editor@tmv.in
న్యాయ సంస్కరణలపై ‘పిల్’ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

న్యాయ సంస్కరణలపై ‘పిల్’ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

Pinjari Chand
19 జనవరి, 2026

న్యాయ వ్యవస్థలో విస్తృత సంస్కరణలు కోరుతూ దాఖలైన ఒక ప్రజాహిత వ్యాజ్యంపై (పీఐఎల్, పిల్) సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ దాన్ని సోమవారం తోసిపుచ్చింది. ఈ పిల్ ను కోర్టు ‘పబ్లిసిటీ ఇంటరెస్ట్ లిటిగేషన్’గా అభివర్ణించింది. బయట నిలబడి ఉన్న కెమెరాల ముందు మాట్లాడేందుకు కోర్టును వేదికగా ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఈ పిల్ లో, దేశంలోని ప్రతి కోర్టు ఒక కేసును గరిష్ఠంగా ఒక ఏడాదిలోపు తీర్మానించాల్సిందేనని ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్‌తో పాటు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి సభ్యులుగా ఉన్న ధర్మాసనం, ఇటువంటి ఆదేశాలు ఇవ్వడం సాధ్యమా? అని ప్రశ్నించింది. ఈ పీఐఎల్‌ను కమలేశ్ త్రిపాఠి అనే వ్యక్తి దాఖలు చేయగా, ఆయనే స్వయంగా కోర్టులో హాజరై వాదనలు వినిపించారు. విచారణ సందర్భంగా తన వాదనలు హిందీలో వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని త్రిపాఠి కోరారు. దేశంలో మార్పు తీసుకురావాలన్న తన ఆకాంక్షపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి, అలాంటి లక్ష్యాలకు పీఐఎల్ సరైన మార్గం కాదని వ్యాఖ్యానించారు. మీరు దేశంలో మార్పు కోరుకుంటున్నారా? అలా అయితే ఇలాంటి పిటిషన్ వేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక లేఖ రాసి నాకు పంపించండి అని సీజేఐ తెలిపారు. పబ్లిసిటీ ఇంటరెస్ట్ లిటిగేషన్‌లు దాఖలు చేసే వారి ఉద్దేశాలపై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బయట నిలబడి ఉన్న కెమెరాల ముందు మాట్లాడేందుకే పిటిషన్లు వేయకండని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.

లేఖ రాయండి.. స్వాగతిస్తాం

పిటిషనర్ చేసిన డిమాండ్‌పై ప్రశ్నిస్తూ ప్రతి కోర్టు ఒక ఏడాదిలో తీర్పు ఇవ్వాలని మీరు అంటున్నారు. అందుకు ఎన్ని కోర్టులు కావాలి? అని సీజేఐ ప్రశ్నించారు. చివరగా, న్యాయ సంస్కరణలపై ఏవైనా సూచనలు ఉంటే, పిటిషనర్ పరిపాలనా పరంగా ప్రధాన న్యాయమూర్తికి లేఖ రూపంలో పంపవచ్చని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. అటువంటి సూచనలను ఎల్లప్పుడూ స్వాగతిస్తామని కూడా స్పష్టం చేసింది.

న్యాయ సంస్కరణలపై ‘పిల్’ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు - Tholi Paluku