
నేతన్నలపై పెట్టుబడి భారం తగ్గించేందుకు నూలు సరఫరా: మంత్రి సవిత
చేనేత కార్మికులపై పెట్టుబడి భారం తగ్గించి, వారికి గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. చేనేత వస్త్రాల తయారీకి అవసరమైన నూలును పెట్టుబడిగా రుణ రూపంలో అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చేనేత ఉత్పత్తులను ఆప్కో అధికారులు కొనుగోలు చేసిన అనంతరం, సరఫరా చేసిన నూలు విలువను మినహాయించి మిగిలిన మొత్తాన్ని నేతన్నలకు చెల్లించే విధానం అమలు చేయాలని సూచించారు.
అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో బుధవారం చేనేత, జౌళి శాఖ, ఖాదీ గ్రామీణ పారిశ్రామికాభివృద్ధి బోర్డు అధికారులతో మంత్రి సవిత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాఖల పరిధిలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులు మంత్రికి వివరించారు.
‘నేతన్నల సేవలో’పై వేగంగా చర్యలు
చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్‌తో పాటు రూ.25 వేల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ‘నేతన్నల సేవలో’ పథకాన్ని అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. తొలి విడతలో 71,536 మంది నేతన్నలకు రూ.25 వేల చొప్పున సాయం అందించినట్లు చెప్పారు. మరింత మంది అర్హులకు ప్రయోజనం కల్పించేందుకు 36,632 దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు. వీటిని పరిశీలించి పది రోజుల్లోగా అర్హులను ఎంపిక చేసి, రెండో విడత ఆర్థిక సాయాన్ని వీలైనంత త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు.
పెనుకొండలో ఆప్కో షోరూమ్
ఆప్కో, లేపాక్షి షోరూమ్‌లలో చేనేత, హస్తకళా ఉత్పత్తుల విక్రయాలను పెంచాలని మంత్రి సూచించారు. రానున్న పండగలను దృష్టిలో ఉంచుకుని డిస్కౌంట్ సేల్స్ నిర్వహించాలని ఆదేశించారు. ఈ నెల 6న పెనుకొండలో ఆప్కో షోరూమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. భోగాపురం విమానాశ్రయంలోనూ ఆప్కో, లేపాక్షి షోరూమ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఖాదీ గ్రామీణ పారిశ్రామికాభివృద్ధి బోర్డు ద్వారా అందించే స్వయం ఉపాధి యూనిట్లపై గ్రామస్థాయిలో విస్తృత అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సవిత ఆదేశించారు. చేనేత, హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, కమిషనర్ రేఖారాణి, బోర్డు సీఈవో సింహాచలం, లేపాక్షి ఎండీ విశ్వ తదితరులు పాల్గొన్నారు.
