Let's talk: editor@tmv.in
నేడు హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం

నేడు హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం

Gaddamidi Naveen
20 జులై, 2026

హైదరాబాద్ మహానగరంలో నిరుపేదలకు గౌరవప్రదమైన సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది. క్యూర్ పరిధిలో ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని (నేడు) జూలై 20న రాష్ట్ర సచివాలయంలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు.

పేదల సొంతింటి కలలను నిజం చేయడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరం వరకు ప్రతి అర్హులైన నిరుపేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

సోమవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి ఇన్‌చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి దరఖాస్తు విధానం, అర్హతలు, బ్రోచర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. తొలి విడతలో ప్రతి నియోజకవర్గంలో 500 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడనున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లో లక్ష ఇళ్లు నిర్మించనున్న ప్రభుత్వం, మొత్తం 3.50 లక్షల కొత్త ఇళ్ల లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత ఏడాది మంజూరు చేసిన 4.50 లక్షల ఇళ్లతో కలిపి మొత్తం 8 లక్షలకు పైగా పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి తెలిపారు.

హైదరాబాద్ నగరంలో పేదల ఇళ్ల కోసం కోట్ల రూపాయల విలువైన కీలక ప్రాంతాలను ప్రభుత్వం గుర్తించి, స్థానిక అవసరాలకు అనుగుణంగా ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు భూమిని సేకరించిందన్నారు. అక్కడ ఆధునిక సౌకర్యాలతో పది అంతస్తుల వరకు బహుళ అంతస్తుల భవనాలను నిర్మించి లబ్ధిదారులకు కేటాయిస్తామని మంత్రి చెప్పారు. ప్రతి నియోజకవర్గాన్ని ప్రత్యేక యూనిట్‌గా తీసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నందున, ఆయా నియోజకవర్గాలకు చెందిన అర్హులైన ప్రజలు తమ నియోజకవర్గంలోనే దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. రాష్ట్రంలో గూడు లేని చివరి అర్హ కుటుంబానికి సొంతిల్లు అందించే వరకు ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు
IndirammaIlluLIGHousingHyderabadTelanganaRevanthReddyPonguletiSrinivasaReddyAffordableHousingHousingForAllTelanganaGovernmentHyderabadDevelopmentUrbanHousing
నేడు హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం - Tholi Paluku