
నేడు భీమవరంలో వైఎస్ జగన్ పర్యటన
రాష్ట్రంలో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం (నేడు) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఆక్వా రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వారికి భరోసా కల్పించేందుకు ఈ పర్యటన చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఇటీవల పలువురు ఆక్వా రైతులు వైఎస్ జగన్ను కలిసి తమ సమస్యలను వివరించడంతో పాటు ప్రభుత్వంపై గళం వినిపించాలని కోరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడాలని ఆయన నిర్ణయించారు. భీమవరం చేరుకున్న అనంతరం ఉండి బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద ఆక్వా రైతులతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పెరుగుతున్న ఆక్వా ఫీడ్ ధరలు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల, రొయ్యలు, చేపలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులపై చర్చించనున్నారు.
అలాగే విద్యుత్ ఛార్జీల భారం, ఎగుమతుల్లో తలెత్తుతున్న సమస్యలు, ఆక్వా రంగానికి అవసరమైన మద్దతు లేకపోవడం వంటి అంశాలపై రైతుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఆక్వా రంగం ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితులపై రైతుల నుంచి నేరుగా వివరాలు సేకరించి, వాటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా రైతుల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని, ఆక్వా రైతులకు న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తామని వైఎస్ జగన్ హామీ ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
