
నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు దేశ రాజధాని న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘రైసినా డైలాగ్-2026’ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఓఆర్ఎఫ్) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో ప్రపంచ దేశాల ప్రతినిధులు, ఆర్థిక నిపుణులు పాల్గొంటున్నారు.
పాలనలో సాంకేతికత.. భవిష్యత్తు ప్రణాళికలు
ఈ సదస్సులో భాగంగా ‘టెక్నాలజీ, పాలన భవిష్యత్తు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సెషన్లో సాంకేతికతను ఉపయోగించి సామాన్యుడికి ప్రభుత్వ సేవలను వేగంగా పారదర్శకంగా ఎలా అందించవచ్చనే అంశంపై ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గతంలో ప్రవేశపెట్టిన, ప్రస్తుతం అమలు చేస్తున్న 'రియల్ టైమ్ గవర్నెన్స్' (ఆర్టీజీఎస్) ఫలితాలను ఆయన ప్రపంచ వేదికపై వివరించనున్నారు.
ఏఐ, డేటా సెంటర్లపై ప్రత్యేక దృష్టి
అదేవిదంగా రాష్ట్రాన్ని ఆధునిక సాంకేతికతకు కేంద్రంగా (హబ్) మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు వివరించనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎకోసిస్టమ్ అభివృద్ధి, భారీ డేటా సెంటర్ల ఏర్పాటు, డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా తీర్చిదిద్దే ప్రణాళికలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు. ఆధునిక తయారీ రంగానికి ఏపీ ఇస్తున్న ప్రాధాన్యతను కూడా వివరించి అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేయనున్నారు.
రైసినా డైలాగ్ అనేది భారతదేశం గర్వంగా నిర్వహించుకునే ఒక అంతర్జాతీయ సదస్సు. ప్రపంచ దేశాల మధ్య ఉండే రాజకీయ, ఆర్థిక, భద్రతా పరమైన సవాళ్లపై చర్చించడానికి ఇది ఒక ప్రధాన వేదిక.ఈ ఏడాది జరుగుతున్న 11వ ఎడిషన్ సదస్సుకు "సంస్కార: అసర్షన్, అకామడేషన్, అడ్వాన్స్మెంట్" అనే ఇతివృత్తాన్ని ఎంచుకున్నారు.కాగా ప్రపంచ దేశాలన్నీ తమ స్వంత అస్తిత్వాన్ని చాటుకుంటూనే ఇతర దేశాలతో కలిసి పని చేస్తూ సాంకేతిక,ఆర్థిక రంగాల్లో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ఈ సదస్సు ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. అయితే ఈ ఏడాది సదస్సును భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ ప్రారంభించారు. ఈ సదస్సులో సుమారు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు.
