Let's talk: editor@tmv.in
నేడు కర్నూలుకు వైఎస్‌ జగన్‌ రాక

నేడు కర్నూలుకు వైఎస్‌ జగన్‌ రాక

Pinjari Chand
13 ఆగస్టు, 2026

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు(ఆగస్టు 13)న కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి 11 గంటలకు కర్నూలు ఓర్వకల్‌ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి పంచలింగాల జిల్లా జైలుకు వెళ్లనున్నారు. జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని వైఎస్‌ జగన్‌ కలవనున్నారు. ఓ కేసులో అరెస్టయి ప్రస్తుతం జైలులో ఉన్న ఎమ్మెల్యేకు ఆయన సంఘీభావం, ధైర్యం చెప్పనున్నారు. ఎమ్మెల్యేతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడి, మధ్యాహ్నం కర్నూలు నుంచి తిరిగి పయనం కానున్నారు.

వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిపై విమర్శలు

ఇటీవల రాజమహేంద్రవరంలో పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్‌ ప్రియాంక మృతి ఘటనపై వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ ఘటనలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ తీవ్ర నిర్లక్ష్యం, రాజకీయ పక్షపాతం ప్రదర్శించిందని ఆరోపించారు. ప్రియాంకను వైద్యురాలిగా చేసేందుకు ఆమె తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారని జగన్‌ పేర్కొన్నారు. ఆమె చదువుకు వారు అండగా నిలిచారని, ఆమె విజయాన్ని, చూడాల్సిన తల్లిదండ్రులకు ఆ అవకాశం లేకపోవడం బాధాకరమన్నారు. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి దేవుడు ధైర్యం, శక్తిని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

డాక్టర్‌ ప్రియాంక కేసులో ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు వ్యవస్థ వైఫల్యం మరోసారి బయటపడిందని ఆరోపించారు. ప్రతిపక్షంపై, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే వారిపై అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నేతలు, తమ వైఫల్యాలను ఎత్తిచూపే వారిపై ‘రెడ్‌ బుక్‌ రాజ్యాంగం’ పేరుతో వ్యవహరిస్తూ రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. మరోవైపు సాధారణ పౌరులకు సంబంధించిన కేసులు ఎదురైనప్పుడు ప్రభుత్వం, పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించడంలో విఫలమవుతున్నారని జగన్‌ విమర్శించారు. ఇది అత్యంత దురదృష్టకరమని వాపోయారు.

నేడు కర్నూలుకు వైఎస్‌ జగన్‌ రాక - Tholi Paluku