Let's talk: editor@tmv.in
నేడు అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌, స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభం

నేడు అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌, స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభం

Pinjari Chand
13 ఆగస్టు, 2026

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో కీలక మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ (ఈ3), స్టీల్‌ బ్రిడ్జిని నేడు (ఆగస్టు 13న) ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. స్టీల్‌ బ్రిడ్జిని సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుతో అనుసంధానించే కీలక పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. రాజధాని అమరావతికి ప్రధాన ద్వారంగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ కీలకంగా మారనుంది.

21.77 కి.మీ పొడవుతో సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌

అమరావతి రాజధాని ప్రాంతంలో ఎన్‌1 నుంచి ఎన్‌17 రహదారులను అనుసంధానించే సబ్‌-ఆర్టీరియల్‌ రహదారిగా సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 21.77 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిని మూడు దశల్లో నిర్మిస్తున్నారు. మొదటి దశలో 14.35 కి.మీ, రెండో దశలో 3.92 కి.మీ, మూడో దశలో 3.50 కి.మీ మేర రహదారి నిర్మాణం చేపట్టారు. మొత్తం రహదారికి 60 మీటర్ల రైట్‌ ఆఫ్‌ వే (ఆర్‌ఓడబ్ల్యూ) కల్పించారు.

మల్టీమోడల్‌ కారిడార్‌గా అభివృద్ధి

సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును కేవలం వాహనాల రాకపోకలకే కాకుండా సమగ్ర రవాణా అవసరాలను తీర్చేలా మల్టీమోడల్‌ కారిడార్‌గా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో 9 లేన్ల క్యారేజ్‌వే, ఇరువైపులా సర్వీస్‌ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ప్రత్యేక సైకిల్‌ ట్రాక్‌లు, సెంట్రల్‌ బీఆర్‌టీఎస్‌ కారిడార్‌ ఏర్పాటు చేస్తున్నారు.

అదేవిధంగా గ్రీన్‌ బెల్టులు, వర్షపు నీటి డ్రైనేజీ, మురుగునీటి వ్యవస్థ, తాగునీరు, రీయూజ్‌ వాటర్‌ సదుపాయాలు, విద్యుత్‌, గ్యాస్‌ నెట్‌వర్క్‌, ఐసీటీ మౌలిక వసతులను కూడా రహదారిలో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్‌టీఎస్‌ కారిడార్‌కు ఇరువైపులా 2.65 మీటర్ల వెడల్పుతో రెండు మీడియన్లు ఏర్పాటు చేశారు.

దొండపాడు–ఉండవల్లి వరకు బీఆర్‌టీఎస్‌ కనెక్టివిటీ

ఈ3 రహదారిలో మొదటి, రెండో దశలకు సంబంధించిన బీఆర్‌టీఎస్‌ కనెక్టివిటీ ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. దొండపాడు నుంచి ఉండవల్లి వరకు, ఇస్కాన్‌ ఆలయానికి సమీపంలోని కరకట్ట రోడ్డు వరకు ఈ కనెక్టివిటీ ఉంది. దీంతో అమరావతి రాజధాని ప్రాంతంలో సమీకృత ప్రజా రవాణా వ్యవస్థకు మరింత ఊతం లభించనుంది.

కీలక ప్రాంతాలకు అనుసంధానం

సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ ద్వారా దొండపాడు, రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి ప్రాంతాలు అనుసంధానం కానున్నాయి. అక్కడి నుంచి ఎన్‌హెచ్‌-16ను మణిపాల్‌ ఆసుపత్రుల సమీపంలో చేరుకునేలా ఈ రహదారి రూపొందించారు. దీంతో అమరావతి రాజధాని ప్రాంతంలోని గ్రామాలు, ప్రధాన రహదారులు, జాతీయ రహదారికి మెరుగైన కనెక్టివిటీ ఏర్పడటంతో పాటు వాహనాల రాకపోకలు సులభతరం కానున్నాయి. పాదచారులు, సైక్లిస్టులు, ప్రజా రవాణా వినియోగదారులకు కూడా ప్రత్యేక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

రాజధానికి ప్రధాన ద్వారంగా..

అమరావతి అభివృద్ధిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ కీలక మౌలిక వసతిగా నిలవనుంది. రాజధాని ప్రాంతంలోని వివిధ ప్రాంతాలను అనుసంధానించడంతో పాటు భవిష్యత్‌లో పెరగనున్న ట్రాఫిక్‌, ప్రజా రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీనిని అభివృద్ధి చేస్తున్నారు. ఆగస్టు 13న సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌, స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభంతో అమరావతి మౌలిక వసతుల అభివృద్ధిలో మరో కీలక అడుగు పడనుంది.

నేడు అమరావతిలో సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌, స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభం - Tholi Paluku